AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 గంటలు గడవక ముందే… విశాఖలో మరో మహిళ దారుణ హత్య..!

ఏమైందో ఏమో కానీ ఆఫీసులో ఉన్న సుజాత దగ్గరికి వెళ్ళాడు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి. HDFCలో రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు ఉమామహేశ్వరరావు. డ్యూటీలో ఉన్న సుజాత దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇంతలో లోపలే ఉన్న మై ర్యాంక్ యజమాని శ్రీనివాసరావు ప్రశ్నించాడు. దీంతో తన అత్త కొడుకని చెప్పింది సుజాత. ఈలోగా ఆమె సెల్ఫోన్ తీసుకొని కిందకు వెళ్లిపోయాడు ఉమామహేశ్వరరావు.

24 గంటలు గడవక ముందే... విశాఖలో మరో మహిళ దారుణ హత్య..!
Sujatha
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 18, 2023 | 9:56 PM

Share

విశాఖలో మరో దారుణం..! ఓ మహిళకు వెంటపడుతూ ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఆమెతో వాగ్వాదానికి దిగి.. ఉన్మాదిగా మారి కత్తితో పొడిచి చంపేశాడు. ద్వారకా నగర్‌లో ఈ ఘటన జరిగింది. పెదగంట్యాడలోని సుభాషిని అనే మహిళ హత్య ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో డ్యూటీలో ఉన్న మహిళ దారుణ హత్యకు గురి కావడంతో తీవ్ర కలకలం రేగుతుంది. ఆరిలోవ ప్రాంతంలో నివాసం ఉంటున్న సుజాత అనే మహిళకు గతంలో వివాహం అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటుంది. గత 20 రోజుల క్రితం ద్వారకా నగ‌ర్‌లోని మై రాంక్ అనే కన్సల్టెన్సీ కార్యాలయంలో టెలికాలర్‌గా చేరింది సుజాత.

ఏమైందో ఏమో కానీ ఆఫీసులో ఉన్న సుజాత దగ్గరికి వెళ్ళాడు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి. HDFCలో రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు ఉమామహేశ్వరరావు. డ్యూటీలో ఉన్న సుజాత దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇంతలో లోపలే ఉన్న మై ర్యాంక్ యజమాని శ్రీనివాసరావు ప్రశ్నించాడు. దీంతో తన అత్త కొడుకని చెప్పింది సుజాత. ఈలోగా ఆమె సెల్ఫోన్ తీసుకొని కిందకు వెళ్లిపోయాడు ఉమామహేశ్వరరావు. వెంటనే అతను వెనుక సుజాత కూడా పరిగెత్తింది. ఐదో ఫ్లోర్ నుంచి నాలుగో ఫ్లోర్‌కు వచ్చేసరికి.. ఏమైందో ఏమో కానీ పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినిపించాయి. వెళ్లి చూసేసరికి సుజాత రక్తపు మడుగులో పడి ఉంది. ప్రాణాలు కోల్పోయింది. పక్కనే ఉమామహేశ్వరరావు కూడా గొంతుకు గాయంతో ఉన్నాడు. దీంతో హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే గత కొంతకాలంగా సుజాత వెంట ఉమామహేశ్వరరావు పడుతున్నాడని ఆరోపిస్తోంది సుజాత తల్లి కృప. కత్తి పట్టుకుని తిరుగుతున్నాడని తన కూతురు చెప్పేదని అంటుంది. ఉమామహేశ్వరరావు, సుజాతకు పరిచయం ఎలా అన్నదానిపై తనకు తెలియదని అంటుంది తల్లి. కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు అంటూ కన్నీరు మున్నీరై విలపిస్తోంది.

సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితుడు కే జి హెచ్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో కత్తి ప్రాణాలు కోల్పోయిన సుజాత చేతిలో ఉండడం అయోమయానికి గురి చేసింది. నిందితుడే ఈ డ్రామా ఆడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుజాతతో వాగ్వాదానికి దిగడంతో ప్రశ్నించేసరికి కిందకు వెళ్లిపోయాడని.. గతంలో ఎప్పుడో సుజాత కోసం రాలేదని అంటున్నారు మై రాంక్ యజమాని శ్రీనివాసరావు.  నగదు బాకీ ఉండటంతో.. తనతో గొడవ పడుతున్నట్టు సుజాత చెప్పిందని అంటున్నారు. మరోవైపు ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు ఏసిపి వివేకానంద. ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో నిందితుడు ఉండడంతో.. అతని వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.