AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IISc Bengaluru: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్స్‌కి పండగలాంటి వార్త.. JoSAA కౌన్సెలింగ్‌లోకి ఐఐఎస్‌సీ ఎంట్రీ!

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) బీటెక్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ఇకపై జాయింట్‌ సీట్‌ ఎలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ద్వారా జరగనుంది. ఈ మేరకు ఐఐఎస్‌సీ తాజాగా ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ రూర్కీ ఈ విషయాన్ని..

IISc Bengaluru: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్స్‌కి పండగలాంటి వార్త.. JoSAA కౌన్సెలింగ్‌లోకి ఐఐఎస్‌సీ ఎంట్రీ!
IISc Bengaluru BTech Admission Through JEE Advanced
Srilakshmi C
|

Updated on: Jan 30, 2026 | 6:11 AM

Share

హైదరాబాద్‌, జనవరి 30: ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) బీటెక్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ఇకపై జాయింట్‌ సీట్‌ ఎలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ద్వారా జరగనుంది. ఈ మేరకు ఐఐఎస్‌సీ తాజాగా ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ రూర్కీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచే బీటెక్‌ సీట్లను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. నిజానికి, 2025-26 విద్యా సంవత్సరంలోనూ ఐఐఎస్‌సీలో బీటెక్‌ సీట్లను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుల ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భర్తీ చేసేవారు. అయితే విద్యార్ధులకు అవగాహన లేకపోవడం వల్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మెరిట్‌ విద్యార్థులు కూడా నష్టపోయారు.

ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐఎస్‌సీలోని బీటెక్‌ సీట్లను కూడా జోసా కౌన్సెలింగ్‌ ద్వారా అధికారికంగా భర్తీ చేయనున్నట్లు ప్రకటన వెలువరించారు. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారు ఎవరైనా ఐఐఎస్‌సీలో సీటు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 100లోపు ర్యాంకులు వచ్చిన వారు ఏకంగా 20 నుంచి 25 మంది వరకు ఉంటున్నారు. వీరంతా ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్‌లోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఇకపై వీరు ఐఐఎస్‌సీలోనూ ప్రవేశాలు పొందొచ్చని అధికారులు సూచించారు. అయితే ఐఐఎస్‌సీలో బీటెక్‌ ఇన్‌ మ్యాథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ కోర్సు మాత్రమే ఉంది. అందులో 52 సీట్లు ఉన్నాయి. ఇందులో 8 సీట్లను అమ్మాయిలకు సూపర్‌ న్యూమరరీ కింద కేటాయిస్తారు. మరో 4 విదేశీ విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు. అయితే ఈ విద్యా సంస్థ జోసాలో చేరడంతో బీటెక్‌ కోర్సులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బెంగళూరు ఐఐఎస్‌సీ సైన్స్‌ కోర్సులకు ప్రసిద్ధి. ఈ కోర్సుల్లో ఇక్కడ లోతైన పరిశోధనలు జరుగుతుంటాయి. అందుకే సైన్స్‌ విద్యార్థులు ఇక్కడ పీహెచ్‌డీ చేయాలని కలలు కంటారు. 2016 నుంచి జాతీయ ర్యాంకింగ్‌లో ఐఐఎస్‌సీ టాప్‌లో నిలుస్తోంది. ఇక తాజాగా బీటెక్‌ కోర్సులు మరికొన్ని పెంచితే సైన్స్‌తో పాటు, ఇంజనీరింగ్‌ కోర్సులు కూడా మరిన్నిపెట్టడం వల్ల ఐఐఎస్‌సీ ర్యాంకు ఇంకా మెరుగుపడే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.