ఆ లోపు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలి: కేసీఆర్ ఆదేశం

నియంత్రిత సాగు విధానంకు అంగీకరించిన రైతులపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని ఆయన అన్నారు.

ఆ లోపు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలి: కేసీఆర్ ఆదేశం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 15, 2020 | 7:09 PM

నియంత్రిత సాగు విధానంకు అంగీకరించిన రైతులపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని ఆయన అన్నారు. దీనికి రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందని చెప్పారు. ఈ క్రమంలో వెంటనే రైతులకు రైతు బంధు సాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడొద్దని.. వారం, పది రోజుల్లో రైతు బంధు సాయాన్ని కోరిన ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. రైతుబంధు డబ్బులను ఉపయోగించుకుని, వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని ఆయన రైతులను కోరారు.

నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవడానికి అనుగుణంగానే రైతులు విత్తనాలను కూడా కొనుగోలు చేసినట్లు సీడ్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.  ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు వర్షాకాంలో 41,76,778 ఎకరాల్లో వరి పంటను, 12,31,284 ఎకరాల్లో కందులను, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్ ను, 60,16,079 ఎకరాల్లో పత్తిని, 1,53,565 ఎకరాల్లో జొన్నలను, 1,88,466 ఎకరాల్లో పెసర్లను, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరుకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానంకు సిద్ధమయ్యారని వారు వివరించారు.

5,500కోట్లు బదిలీ చేశాము: కేసీఆర్

‘‘రాష్ట్రంలో రైతులంతా పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరు రైతులకు వెంటనే రైతుబంధు సాయం అందించాలి. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటున్నప్పటికీ రైతుబంధు డబ్బులు మాత్రం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి ఒక ఎకరానికి పదివేల చొప్పున సాయం అందించాలన్నది ప్రభుత్వ విధానం. వర్షాకాలంలో ఐదు వేలు, యాసంగిలో ఐదు వేలు ఇస్తున్నాం. ఈ వర్షాకాలంలో అందరు రైతులకు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం ఏడు వేల కోట్లు కావాలి. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో 1500 కోట్ల రూపాయలను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం. తక్షణం రైతులకు రైతుబంధు డబ్బులను బ్యాంకుల్లో జమ చేసే పని ప్రారంభమవుతుంది. వారం, పది రోజుల్లో రైతుబంధు సాయం బ్యాంకుల్లో జమ కావాలి. ఇది రైతులకు అండగా ఉండాలనే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read This Story Also: మహేష్ సినిమాలో నటించబోతున్నారా..? హీరోయిన్‌ రియాక్షన్ ఏంటంటే..!