చెరువులో దూకి విలేజ్ సెక్రటరీ ఆత్మహత్య..!
గ్రామ కార్యదర్శి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది.
జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. కోటగిరి మండలం కొడిచర్ల గ్రామ రెవెన్యూ కార్యదర్శి కృష్ణారెడ్డి పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తడికి గురై, రుద్రూర్ లోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి బయట వెళ్లిన కృష్ణా రెడ్డి.. రుద్రూర్ చెరువులో శవమై తేలాడు. చెరువులో అతని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులను విచారించిన అనంతరం జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.