AP School Students Mental Health: బడి పిల్లల మానసిక శక్తిని పెంచేందుకు కూటమి సర్కార్ ఏం చేసిందో తెలుసా?.. ఇదే తొలిసారి!
ఇటీవల కాలంలో స్కూల్ విద్యార్ధులు వయసుకు మించిన మానసిక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. చిన్న కారణాలకే ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. అంతేనా పెద్దలకు ఎదురు తిరగడం, నేరాలకు పాల్పడటం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వంటి చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. వీటి నివారణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది..

అమరావతి, మార్చి 24: పాఠశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యకు పాల్పడటం, మాదకద్రవ్యాలకు బానిసవడం, భావోద్వేగాలు అదుపు తప్పడం లాంటి సమస్యల నుంచి విద్యార్థులను కాపాడటానికి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కొత్త కౌన్సెలర్ నియామకాలు జరిగాయి. మానసిక ఒత్తిడిని జయించేలా, స్థిరమైన నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ కౌన్సెలర్ల లక్ష్యం.
దేశంలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు
ప్రతి మండలంలో కనీసం ఒక్క కౌన్సెలర్ అందుబాటులో ఉండేలా నియామకాలు చేపట్టిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాస రావు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ విషయం వెల్లడించారు. కౌన్సెలర్లను కేవలం సిబ్బందిగా కాకుండా మానసిక వైద్యులుగా చూసుకోమని ఆయన పిలుపునిచ్చారు.
గాయం మొగ్గలోనే తుంచాలి
యుక్తవయసులో హార్మోన్ మార్పులు, పరీక్షల ఒత్తిడి, ఇంట్లో కలతలు ఇవేవీ పెద్దవి కాకపోయినా పిల్లల మనసుకు లోతైన గాయాలు చేస్తాయి. అవి సకాలంలో గుర్తించకపోతే చేజారిపోతాయి. అందుకే కౌన్సెలర్లు.. హెడ్మాస్టర్లు, టీచర్లతో కలిసి నిరంతరం పని చేస్తూ విద్యార్థులకు అండగా నిలవాలని అధికారులు నిర్దేశించారు.
జూన్లో మేధస్సు పరీక్షలు
8, 9వ తరగతుల విద్యార్థులకు జూన్లో సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి పిల్లల మేధో సామర్థ్యాన్ని అంచనా వేసి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. AIIMS మంగళగిరి, UNICEF, EASE సంస్థల నిపుణులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. బాధ్యతగల పౌరులను తయారు చేయడమే అంతిమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




