అబ్బా అబ్బా.. ఏం ఎలుకలు రా సామీ! డోంట్ వర్రీ..ఇలా చేశారంటే పరుగో పరుగు
ఇంట్లో ఎలుకల బెడద అనేది చాలా పెద్ద సమస్య. అవి బట్టలు, ఆహార పదార్థాలను పాడు చేయడమే కాకుండా వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. సాధారణంగా మనం ఎలుకలను చంపడానికి మార్కెట్లో లభించే కెమికల్స్‌ని వాడుతుంటాం. కానీ, అది ఇంట్లో పిల్లలు లేదా పెంపుడు జంతువులకు ప్రమాదకరం. దీనికి పరిష్కారంగా సోషల్ మీడియాలో ఒక సులభమైన, ప్రభావవంతమైన చిట్కా వైరల్ అవుతోంది. అదే టర్పెంటైన్ ఆయిల్ (Turpentine Oil) ఉపయోగించడం. దీనిని ఎలా వాడాలి..? ఎలుకలు ఎలా పరిగెడతాయో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

ఇంట్లో ఎలుకలు చేరాయంటే చాలు.. వంటగదిలోని సామాగ్రి నుండి ఖరీదైన ఎలక్ట్రానిక్ వైర్ల వరకు ఏదీ సురక్షితం కాదు. ఎలుకలను వదిలించుకోవడానికి మనం బోన్లు (traps) పెట్టడం లేదా విషపు బిళ్ళలు వాడటం వంటివి చేస్తాం. అయితే, ఎలుకలు చనిపోతే వచ్చే దుర్వాసన మరో పెద్ద సమస్యగా మారుతుంది. దీనికి పరిష్కారంగా ఎలుకలను చంపకుండానే ఇంటి నుండి శాశ్వతంగా తరిమికొట్టే ఒక అద్భుతమైన హ్యాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ నితిన్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, టర్పెంటైన్ ఆయిల్ (Turpentine Oil) ఎలుకలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
సాధారణంగా పెయింటింగ్ పనుల్లో వాడే టర్పెంటైన్ ఆయిల్‌కు చాలా ఘాటైన వాసన ఉంటుంది. ఎలుకల ఘ్రాణ శక్తి (వాసన చూసే శక్తి) చాలా ఎక్కువ. టర్పెంటైన్ ఆయిల్ నుంచి వచ్చే తీవ్రమైన వాసన వాటికి ఊపిరాడకుండా చేస్తుంది. ఆ వాసన ఉన్న చోట ఎలుకలు ఒక్క క్షణం కూడా నిలబడలేవు.
ఈ చిట్కాను ఎలా పాటించాలి?:
ఈ పద్ధతి చాలా సులభం, ఖర్చు తక్కువ. దీని కోసం కొన్ని దూది ఉండలు (Cotton balls), టర్పెంటైన్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న దూది ఉండలను తీసుకుని వాటిని టర్పెంటైన్ ఆయిల్‌లో బాగా తడపండి. ఈ దూది ఉండలను ఎలుకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ఉంచండి. ముఖ్యంగా అల్మారాల వెనుక, గ్యాస్ సిలిండర్ పక్కన, స్టోర్ రూమ్ మూలల్లో, అవి ఇంట్లోకి ప్రవేశించే రంధ్రాల వద్ద వీటిని పెట్టాలి.
టర్పెంటైన్ ఆయిల్ ఒక రసాయనం, కాబట్టి చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు తాకకుండా జాగ్రత్త వహించాలి. అలాగే, ఇది త్వరగా నిప్పు అంటుకునే స్వభావం కలది. కాబట్టి, గ్యాస్ స్టవ్ లేదా వెలుగుతున్న దీపాలకు దూరంగా పెట్టాలి.
ఆయిల్ వాసన తగ్గినప్పుడల్లా (ప్రతి 2-3 రోజులకు ఒకసారి) కొత్త దూది ఉండలను పెట్టడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం ద్వారా ఎలుకలను చంపకుండానే మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆ వాసన భరించలేక ఎలుకలు వెంటనే ఇంటి నుండి పారిపోతాయి. ఇది ఎలుకలను చంపకుండానే బయటకు పంపే సురక్షితమైన మార్గం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




