Vizag Crime: మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి.. కానీ అంతలోనే బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు..!
ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్..! కూలీ పనులు చేస్తున్న తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తుంది. ఒక్కగానొక్క కూతురికి అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో.. విధి చిన్న చూపు చూసింది. రోడ్డు దాటుతుండగా హై స్పీడ్ లో వచ్చిన ఓ యువకుడు బైక్‌తో బలంగా ఢీకొనడంతో ఆ తండ్రి ఆశలన్నీ అడిఆశలయ్యాయి. నంద్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం పొట్ట కూటి కోసం విశాఖకు వలస వెళ్లారు. పెందుర్తిలో కుటుంబం అంతా..

పెందుర్తి, అక్టోబర్ 10: ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్..! కూలీ పనులు చేస్తున్న తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తుంది. ఒక్కగానొక్క కూతురికి అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో.. విధి చిన్న చూపు చూసింది. రోడ్డు దాటుతుండగా హై స్పీడ్ లో వచ్చిన ఓ యువకుడు బైక్‌తో బలంగా ఢీకొనడంతో ఆ తండ్రి ఆశలన్నీ అడిఆశలయ్యాయి.
నంద్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం పొట్ట కూటి కోసం విశాఖకు వలస వెళ్లారు. పెందుర్తిలో కుటుంబం అంతా నివాసం ఉంటోంది. తండ్రి తాపీ మేస్త్రి. తల్లి చిరు వ్యాపారి. ఆ ఇద్దరికీ ఒక్కాగానొక్క కుమార్తె. చిన్నప్పటినుంచి రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవాలి అనుకుంది ఆ కూతురు. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా చేరింది.
పెళ్లి పనుల్లో నిమగ్నం అయిన కుటుంబం
ముల్లా షాహీదా (22) అనే యువతి పెందుర్తిలో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో టీచరుగా పనిచేస్తుంది. అందరిలో కలిసిమెలిసి ఉండేది. ఉత్తమ టీచర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. కూతురు పెళ్ళీడు రావడంతో ఆమెకు సంబంధం చూశారు తల్లిదండ్రులు. ఓ యువకుడ్ని చూసి ఎంగేజ్మెంట్ కూడా చేశారు. జనవరిలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. తేదీలు కూడా ఫిక్స్ చేసుకొని ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.
తెచ్చుకున్న లంచ్ బాక్స్ విద్యార్థికి పెట్టి..
అయితే తల్లిదండ్రులు ఇద్దరు పెళ్లి పనుల్లో భాగంగా విజయవాడకు వెళ్లారు. బంధువులంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కళ్యాణ మండపం రైల్వే టికెట్లు కూడా బుక్ చేసేశారు. అయితే.. రోజు మాదిరిగా ఉదయాన్నే స్కూలుకు వెళ్ళింది షాహిదా. క్లాసులో ఓ విద్యార్థి లంచ్ బాక్స్ తీసుకురాకపోవడంతో.. తాను తెచ్చుకున్న బాక్స్‌ను ఆ విద్యార్థికి ఇచ్చేసింది టీచర్.
హై స్పీడ్ బైక్ ఢీకొనడంతో ఎగిరిపడి..
కాసేపటి తర్వాత.. ఆకలి వేయడంతో పునుగులు తినాలని అనుకుంది. రోడ్డు పక్కన ఉన్న బడ్డీ కొట్టుకి వెళ్లి పునుగులుతిని.. ఇంటికి బయలుదేరింది. నడుచుకుంటూ బీఆర్‌టీఎస్ రోడ్డు దాటుతుండగా పోలీస్ స్టేషన్ మీదుగా హైస్పీడ్‌గా దూసుకొచ్చిన బైక్ ఒక్కసారిగా ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎగిరి పడింది షాహిదా. తీవ్ర గాయాల పాలైన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మార్గ మధ్యలోనే ఆమె గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. విజయవాడలో ఉన్న పేరెంట్స్ కు ప్రమాదం జరిగిందని మాత్రమే సమాచారం ఇచ్చారు. వాళ్లు కూడా హుటాహుటిన విశాఖ బయలుదేరారు. అసలు విషయం తెలుసుకొని గుండెలు బాదుకుంటూ విలపించారు. ఆ తల్లిదండ్రుల రోదన చూసిన వారందరినీ తీవ్రంగా కలచి వేసింది.
ఆ స్పీడ్ 120పైనే..
నిందితుడు రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్విగ్గీ బాయ్‌గా పనిచేస్తున్న రవితేజ కేటీఎమ్ స్పోర్ట్స్ బైక్ లో దాదాపుగా 120 కిలోమీటర్ల స్పీడ్ లో ర్యాష్ డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి కారణమైనట్టు గుర్తించారు. ఏసీపీ నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




