Odisha Train Tragedy: 4 నెలలు గడుస్తోన్నా.. ఇంకా మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు!
ఒడిసా మూడు రైళ్ల దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉంది. దేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా ఇండియన్ రైల్వే ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల యాక్సిడెంట్‌ను పేర్కొంది. ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఓడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 297 మంది మరణించగా, 1100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇంకా 28 మృతదేహాలను..
భువనేశ్వర్, అక్టోబర్ 9: ఒడిసా మూడు రైళ్ల దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉంది. దేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా ఇండియన్ రైల్వే ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల యాక్సిడెంట్‌ను పేర్కొంది. ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఓడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 297 మంది మరణించగా, 1100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇంకా 28 మృతదేహాలను గుర్తించలేదు. ప్రమాదం తర్వాత మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. వాటిల్లో 28 మృతదేహాలు ఇప్పటికీ మార్చురీలోనే ఉన్నాయి. ఈ మృతదేహాలను తొలగించే బాధ్యతలను రైల్వే విభాగం భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. వీరిని శాస్త్రీయంగా ఖననం చేసేందుకు పౌర సంస్థ ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని జారీ చేసింది.
ఆ మృతదేహాలకు సంబంధించిన వారు ఎవ్వరూ రాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులే ఆ 28 డెడ్‌బాడీస్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఓపీ జారీ చేశారు. సీబీఐ అధికారుల సమక్షంలో మృతదేహాలను కార్పొరేషన్‌కు అప్పగిస్తామని, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని బీఎమ్సీ మేయర్ సులోచన దాస్ మీడియాకు తెలిపారు. రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మృతదేహాలకు శాస్త్రీయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. దీంతో బీఎమ్సీ ఈ మేరకు మృతదేహాల ఖననం ప్రక్రియను ప్రారంభించిందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర, కేంద్రం, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ల నియమనిబంధనల ప్రకారం భువనేశ్వర్ ఎయిమ్స్ డైరెక్టర్ మృతదేహాలను దహన సంస్కారాల కోసం బీఎమ్‌సీ ఆరోగ్య అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. బీఎమ్సీ జారీ చేసిన SOP ప్రకారం మొత్తం ప్రక్రియ వీడియో తీయనున్నట్లు ఆయన వివరించారు.
కాగా ఈ ఏడాది జూన్ 2న సాయంత్రం 7 గంటల సమయంలో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ రైలు ప్రమాద ఘటన జరిగిన తర్వాత 162 మృతదేహాలను నగరంలో భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించగా.. అందులో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎన్‌ఏ టెస్టుల అనంతరం మరో 53 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే వీటిల్లో 28 మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదని అధికారులు తెలిపారు. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ నుంచి సేకరించిన ఐదు డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో ఈ మృతదేహాలను భద్రపరిచారు. ఈ మృతదేహాల కోసం ఇప్పటి వరకూ ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వమే మృతదేహాలకు లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.