Visakhapatnam: కళాకారుని రామభక్తి.. చిరుధాన్యాల్లో అయోధ్య రామ మందిరం రూపం..!
దేశ ప్రజల దశాబ్దాల కళ సాకారమవుతోంది.. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ వంతు భక్తిని చాటుకుంటున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నేరుగా వెళ్లి చూసే అవకాశం దక్కించుకున్న వారు కొందరైతే.. ఈ ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంలో తమదైన శైలిలో భక్తి భావాన్ని చాటుకుంటున్న వారు మరి కొంతమంది. విశాఖకు చెందిన ఓ కళాకారుడు.. తమదైనా శైలిలో రామభక్తిని..
విశాఖపట్నం, జనవరి 21: దేశ ప్రజల దశాబ్దాల కళ సాకారమవుతోంది.. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ వంతు భక్తిని చాటుకుంటున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నేరుగా వెళ్లి చూసే అవకాశం దక్కించుకున్న వారు కొందరైతే.. ఈ ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంలో తమదైన శైలిలో భక్తి భావాన్ని చాటుకుంటున్న వారు మరి కొంతమంది. విశాఖకు చెందిన ఓ కళాకారుడు.. తమదైనా శైలిలో రామభక్తిని చాటుకున్నాడు. చిరుధాన్యాలతో అద్భుతమైన అయోధ్య రామ మందిరం, శ్రీరామచంద్రుడి ప్రతిరూపంకు జీవం పోశాడు.
అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేళ జగమంతా రామమయంగా మారుతుంది. దేశప్రజలంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న వేళ.. రామ భక్తితో భక్తజనం పులకించిపోతున్నారు. అయోధ్య రామమందిరంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపధ్యంలో విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్.. ఓ ప్రత్యేకమైన అంశంతో అయోధ్య రామమందిరం, శ్రీరామచంద్రుడి చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిరుధ్యానాలను(మిల్లెట్స్) వినియోగించి వారం రోజుల పాటు శ్రమించారు విజయ్. నిత్యం 8 గంటలకు పైగా ఏకాగ్రతతో నిష్టతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రాగులు, సజ్జలు, అరికెలు, జొన్నలు, నల్ల స్వాములు, గంట్లు వినియోగించి.. కళాత్మకతను జోడించి ఆయోధ్యలోని రామమందిరం నమూనా, శ్రీరామ చంద్రుని రూపాలను అద్భుతంగా ఒకే చిత్రంలో రూపొందించారు. 18 అంగుళాల ఎత్తు, 24 అంగుళాల వెడల్పుతో సహజత్వం ఉట్టిపడే విధంగా ఈ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు.
అంతకన్నా భాగ్యం ఉంటుందా..
2023 ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రజల్లో సిరి, చిరు ధాన్యాలపట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నానని అంటున్నారు విజయ్ కుమార్. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ తనకున్న కళతో ఆయోధ్యలోని రామమందిరం నమూనా, శ్రీరామ చంద్రుని కళారూపాలను చేయడం కంటే ఇంకే భాగ్యం ఉంటుందని అంటున్నారు. ఈ శుభ సందర్భాన నేరుగా అయోధ్య వెళ్లే భాగ్యం లేకపోయినా.. ప్రతిరూపం వేసినందుకు ధన్యున్నని అంటున్నారు. సామాజిక సందేశాన్ని కళకు జోడిస్తూ విధంగా వివిధ ఉత్సవాలు, పండుగలు, ప్రత్యేక రోజులను ప్రతిబింబిస్తూ అనేక చిత్రాలను చిరుధాన్యాలతో తీర్చిదిద్ది ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు విజయ్ కుమార్. ఇటీవల విశాఖపట్నం, హైదరాబాద్, న్యూ ఢల్లీ నగరాలలో జరిగిన జి- 20 సదస్సుల్లో సైతం తాను తయారుచేసిన చిరుధాన్యాల చిత్రాలను ప్రదర్శించి, రాష్ట్ర, జాతీయ స్తాయిలో ప్రముఖుల, నేతల ప్రశంసలు అందుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.