Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరిత్ర సృష్టించిన విమ్స్‌! అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ చేసిన తొలి ఏపీ ప్రభుత్వాసుపత్రిగా రికార్డు

వైద్యరంగంలో ఓ ప్రభుత్వాసుపత్రి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా లివర్‌ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ ఘనతను సాధించి రాష్ట్ర వైద్య రంగంలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది విశాఖలోని విమ్స్. క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్యులు. ఓ వ్యక్తికి పునర్‌జన్మనిచ్చారు. ఈ సందర్భంగా విమ్స్‌ వైద్యులను అభినందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

చరిత్ర సృష్టించిన విమ్స్‌! అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ చేసిన తొలి ఏపీ ప్రభుత్వాసుపత్రిగా రికార్డు
Vims
Follow us
Maqdood Husain Khaja

| Edited By: SN Pasha

Updated on: Mar 13, 2025 | 3:38 PM

వైద్యరంగంలో ఎన్నో విఫ్లవాత్మక మార్పులు వస్తున్న క్రమంలో గతంలో ఎన్నూడూ జరగని విధంగా విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్స్‌- విమ్స్‌ వైద్యుల బృందం క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను సాహాసోపేతంగా నిర్వహించి అరుదైన రికార్డును సృష్టించారు. కేవలం కార్పోరేట్‌ ఆసుపత్రుల్లోనే జరిగే అత్యంత ఖరీదైన అవయువమార్పిడి సర్జరీలను రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వసతులను వినియోగించుకుంటూ లివర్‌ మార్పిడి శస్త్రచికిత్స చేపట్టి సరికొత్త చరిత్రను సృష్టించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కాలేయాన్ని సేరించి 40 ఏళ్ల వయసు గల వ్యక్తికి విమ్స్ వైద్యులు విజయవంతంగా కాలేయాన్ని అమర్చారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి విశాఖ విమ్స్‌లో లివర్‌ మార్పిడి చేసి నూతన రికార్డును సైతం నెలకొల్పారు.

ఈనెల 2వ తేదీన శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అవయవ దానంపై విమ్స్ డైరెక్టర్ రాంబాబు, జీవన్‌ధాన్ బృందం అవగాహన కల్పించారు. ఆ కుటుంబం అంతటి బాధలోనూ పెద్ద మనసుతో అవయువదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీనితో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఆ వ్యక్తి నుంచి సేకరించిన కాలేయాన్ని.. ఈనెల 3వ తేదీన విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లివర్‌ కోసం జీవన్‌ధాన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తికి ప్రాధాన్యత క్రమాన్ని పాటిస్తూ.. తీవ్ర అనారోగ్యానికి గురైన వ్యక్తికి ఆయా లివర్‌ను అమర్చి పునర్జీవం పోశారు.

విమ్స్ ఆస్పత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, అనస్తీసియా, జెనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్య బృందాలు సమన్వయంతో కాలేయాన్ని విజయవంతంగా అమర్చి ఆయా శస్త్రచికిత్సను విజయవంతం చేశామని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. విమ్స్‌ వైద్యుల బృందం ఈ సంకిష్టమైన సర్జరీను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు, కాలేయ గ్రహీత పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో విమ్స్ వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు. అత్యంత కష్టమైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విమ్స్ ఆస్పత్రిలో నిర్వహించి విజయవంతం చేసి మరోసారి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు, సమర్థతకు మచ్చుతునకగా నిలిచారని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.

అలాగే అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులకు సైతం ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాలేయ మార్పిడికి అవకాశం ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ బాబుకు ఈ సందర్భంగా విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కార్పొరేట్ ఆసుపత్రిల్లోనే కాదు.. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అవయవ మార్పిడి విజయవంతంగా చేస్తామన్న భరోసా కల్పించారు విమ్స్ వైద్యులు. కాస్త సదుపాయాలు కల్పిస్తే కార్పొరేట్ వైద్య సేవలకు తామేమి తక్కువ కాదని నిరూపిస్తామని మరోసారి రుజువు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.