Vijayawada: బెజవాడలో ‘జలం.. గరళం’..! గుక్కెడు తాగితే చాలు.. ఇక అంతే.. !
రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు.. నూరేళ్ల జీవితం మెట్లు అనేది ఆరోగ్యసూత్రం. బెజవాడలో తాగే గుక్కెడు నీళ్లు.. ఆరడుగుల గొయ్యిలోకి తీసుకెళ్లు అనేది అక్కడ వినిపిస్తున్న నినాదం. డయేరియాతో విజృంభిస్తోందక్కడ. కారణం అడిగితే.. మున్సిపాలిటీ ఇచ్చే కుళాయి నీళ్లు అంటున్నారు విజయవాడ వాసులు. అధికారులను అడిగితే.. నీళ్లు కాదు అనారోగ్య కారణాలంటున్నారు. మరి.. పోతున్న ప్రాణాలకు కారణమేంటి? వీఎంసీ నీళ్లా, అనారోగ్య కారణాలా?

బెజవాడలో నీళ్లు తాగాలంటే.. భయం భయం..! కుళాయిల్లో వచ్చేది మంచినీరా.. డ్రైనేజీ వాటరా..! అర్థం కాని పరిస్థితి. ఆ తాగినోళ్లంతా చనిపోలేదు సరే.. చనిపోయినోళ్లంతా తాగింది ఆ నీళ్లేగా..! ఇది ఇప్పుడు అది పెద్ద డౌట్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కుళాయి నీళ్లు తాగి.. తన తండ్రి చనిపోయాడని చెబుతున్నాడో బాలుడు. నీళ్లు బాగోలేవని కంప్లైంట్ చేస్తూనే ఉన్నా.. ప్రాణం పోయిన తరువాత గానీ అధికారులు స్పందించలేదని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దీనికి సమాధానం ఉందా వీఎంసీ దగ్గర..!
గుక్కెడు నీళ్లు తాగి చూడండి.. వెంటనే ఆంబులెన్స్‌కు కాల్ చేయకపోతే అడగండి. ఛాలెంజ్ చేసి చెబుతున్నారు బెజవాడ ప్రజలు. రేబిస్ సోకిన వాళ్లు నీళ్లను చూస్తే భయపడిపోతారు. బెజవాడవాసులు కూడా కుళాయి నీటిని చూడగానే బెంబేలెత్తిపోతున్నారు. ఎస్.. వీఎంసీ సరఫరా చేసిన నీటిలో ప్రాబ్లమ్ ఉంది. స్వయంగా కమిషనరే ఒప్పుకున్నారీ విషయాన్ని. కొంతమందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి కూడా. స్థానిక ఆర్ఎంపీల దగ్గరికి స్వయంగా వెళ్లి ఎంక్వైరీ చేశారు కమిషనర్. వాళ్లు కూడా తమ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు వాంతులు, విరోచనాలు తగ్గడానికి మందులిచ్చామని చెప్పారు. బట్.. అవన్నీ ఒక్కరోజులో తగ్గిపోయిన సమస్యలే తప్ప.. ఎవరి ప్రాణాలు పోలేదంటున్నారు వీఎంసీ కమిషనర్.
కొన్నిరోజులుగా ఆకుపచ్చ రంగులో ఉండే నీటిని వదులుతున్నారు అధికారులు. అదేమంటే.. క్లోరిన్ వేస్తే అలాగే ఉంటుందని చెబుతున్నారు కమిషనర్. ఆయన చెప్పేది నిజమే. మరి.. మరణాలకు కారణమేంటి? వారంలోనే ఏడుగురు చనిపోయారు. మృతులు పెరగొచ్చని కూడా చెబుతున్నారు. ఆకుపచ్చగా వచ్చిన నీళ్లే కారణమని ప్రజలు ఆరోపిస్తుంటే.. అదేం లేదని కమిషనర్ అంటున్నారు. ఇందులో ఎవరి వాదన నిజం..? అన్నది చర్చనీయాంశం.
బెజవాడలో డయేరియా సోకుతోందని, మరణాలూ సంభవిస్తున్నాయని తెలిసిన తరువాత వీఎంసీ యంత్రాంగం కదిలింది. కాని, అంతకు పది, 15 రోజుల వరకు వీఎంసీ సప్లై చేసింది కలుషిత నీరేనన్నది బెజవాడ వాసులు వాదన. నగరంలోని చిట్టినగర్, మొగల్రాజపురం, ఆటోనగర్, కృష్ణాలంక.. ఇంకా ఇతర ప్రాంతాల్లో కుళాయిలు తిప్పుతుంటే పచ్చ రంగులో నీళ్లు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. కాని, విజయవాడ మున్సిపాలిటీ మాత్రం.. అత్యంత సురక్షితమైన నీటినే సరఫరా చేస్తోందని, కలుషిత నీరు తాగి ఎవరు చనిపోలేదంటోంది. చనిపోయిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు కమిషనర్.
విజయవాడ కుళాయిల్లోని కలుషిత నీరు తాగి.. ఏడుగురు చనిపోయారన్నది నమ్మాలా.. లేక అధికారులు చెబుతున్న మాటలు నమ్మాలా. ఈ మరణాలు ఎప్పటికి ఆగేది….!!?.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
