Vallabhaneni Vamsi: నార్కో టెస్ట్ చేయాలంటూ వంశీ డిమాండ్! ఆ కేసులో నిజాలు బయటపడే ఛాన్స్
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్టుతో కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో వంశీ తొలుత నేరం అంగీకరించినా, తరువాత తనకు సంబంధం లేదని, నార్కో టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇతర నిందితులతో పాటు వంశీపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. వంశీ తరపు న్యాయవాది ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని వాదిస్తున్నారు.

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసులో వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో మూడు రోజులపాటు పోలీసులు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్‌తో పాటు.. కేసులో ఇతర నిందితుల స్టేట్‌మెంట్స్ వంశీ ముందు ఉంచి పోలీసులు ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్‌లో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై ఆరా తీశారు. ఈ విచారణలో వంశీ నేరం అంగీకరించాడని పోలీసులు చెబుతుంటే.. జడ్డి ముందు వంశీ ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఈకేసుతో తనకు సంబంధం లేదని అవసరమైతే నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమని వల్లభనేని వంశీ అన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వేరే బ్యారక్‌లో తనకు వసతి కల్పించాలని వంశీ కోరారు. ఒక్కడినే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని వంశీ కోరడంతో మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది.
అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. వంశీకి నార్కో అనాలసిస్ట్ టెస్ట్ చేస్తే సత్యవర్ధన్ కేసులో సత్యం బయటపడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఒకవైపు పోలీసులు మాత్రం సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసినట్టు వంశీ ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్‌ను బెదిరించి, వల్లభనేని వంశీ కేసును తారుమారు చేయాలని చూశారని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ వెల్లడించారు. వల్లభనేని వంశీతోపాటు అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
మూడు రోజుల విచారణలో వంశీ ఏం సహకరించలేదని.. ఇంకా పలు విషయాలు ఆయన నుంచి రాబట్టాల్సి ఉండటంతో మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వంశీపై మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. మర్లపాలెంలో రైతుల భూములు కబ్జాచేసి, మట్టి అమ్ముకున్నారని మురళీకృష్ట ఫిర్యాదు మేరకు ఒక కేసు, గన్నవరంలో రూ.10కోట్ల స్థలాన్ని కబ్జాచేశారని వంశీపై సిట్‌కి సీతామాలక్ష్మి ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు అయింది. అయితే ప్రభుత్వం కావాలనే వంశీపై తప్పుడు కేసులు పెడుతోందని ఈ కేసులు కోర్టుల్లో నిలబడవన్నారు వంశీ తరపు న్యాయవాది చిరంజీవి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
