Andhra News: వక్క కాయలపై అందమైన చిత్రాలు.. ఆక్టటుకుంటున్న స్టాల్ బొమ్మలు
గుంటూరులో ఏర్పాటు చేసిన జాతీయ డ్వాక్రా బజార్ లో గుజరాత్ మహిళల ప్రత్యేక వక్క కాయల బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చేతితో తయారు చేసే ఈ దైవ ప్రతిమలు, ముఖ్యంగా వినాయకుడి భార్యలైన రిద్ది, సిద్ది బొమ్మలు, ఇంట అలంకరణకు, పూజలకు ఉపయోగిస్తారు. వీటిని ఉంచడం వలన శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో వీటికి అధిక డిమాండ్ ఉంది, జాతీయ సరస్ మేళాలలో కూడా విక్రయిస్తున్నారు.

డ్వాక్రా మహిళలు తయారు చేసిన చేతి ఉత్పత్తులను విక్రయించుకునేందుకు జాతీయ స్థాయిలో డ్వాక్రా బజార్ ను గుంటూరులో ఏర్పాటు చేశారు. పది రోజుల క్రితం ఏర్పాటు చేసిన బజార్ లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన డ్వాక్రా సంఘాలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ స్టాల్స్ లో ఒక దుకాణం ప్రత్యేకంగా అందరిని ఆకట్టుకుంటుంది.
గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లా గుండాల ప్రాంతానికి చెందిన మహిళల వేసిన కళా క్రుతులు ఆకట్టుకుంటున్నాయి. సాధారణమైన బొమ్మలు కాకుండా వక్క కాయలపై దేవతల బొమ్మలు వేయడం వీరి ప్రత్యేకత.. దేవతల బొమ్మల్లో కూడా వినాయకుడు భార్యలైన రిద్ది, సిద్ది బొమ్మలు అధికంగా వేస్తారు. వాటిని తయారు చేసి విక్రయిస్తుంటారు. బొమ్మలు వేయడమే కాకుండా వాటికి స్థానిక ఆభరణాలు కూడా అద్దుతారు. పరదా, కిరీటం వంటి వాటితో ప్రత్యేకంగా రూపొందిస్తారు. దీంతో ఈ బొమ్మలు చూడ చక్కగా ఉంటాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్లో ఈ బొమ్మలను చూసేందుకు మహిళలు మక్కువ చూపుతున్నారు.
అందంగా తయారు చేసిన దేవతల బొమ్మలను ఇంట్లో అలంకరణ కోసమే కాకుండా పూజల్లో ప్రత్యేకంగా ఉంచుతారని అక్కడి మహిళలు చెప్పారు. గణపతి పూజల్లో వీటిని ఉంచడంతో అంతా శుభమై జరుగుతుందని విశ్వసిస్తారు. దీంతో గుజరాత్ తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ బొమ్మలకు ఎంతో డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో జరిగే సరస్ మేళాల్లో ప్రత్రేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేతితో తయారు చేసిన బొమ్మలు కావడంతో కొనుగోలు చేసేందుకు మహిళలు ముందుకొస్తున్నట్లు హస్త కళాకారిణి రాధ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
