AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ముదిరిన టీటీడీ బోర్డు Vs ఎంప్లాయిస్ వివాదం.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్!

టీటీడీలో పాలక మండలి ఉద్యోగుల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడింది. టీటీడీ బోర్డు వర్సెస్ ఎంప్లాయిస్ అన్నట్టు వివాదం రాజుకుంటోంది. రెండ్రోజుల క్రితం ఆలయ మహద్వారం గేటు వద్ద కర్ణాటకకు చెందిన బోర్డు సభ్యుడు టీటీడీ సిబ్బంది పట్ల దురుసు ప్రవర్తనే ఇందుకు కారణం అయ్యింది..

Tirupati: ముదిరిన టీటీడీ బోర్డు Vs ఎంప్లాయిస్ వివాదం.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్!
TTD Board Vs Employees
Raju M P R
| Edited By: |

Updated on: Feb 21, 2025 | 10:08 AM

Share

తిరుపతి, ఫిబ్రవరి 21: టీటీడీలో ఇప్పుడు మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. టీటీడీ పాలకమండలికి ఉద్యోగ సంఘాలకు మధ్య గ్యాప్ ఏర్పడింది. కొన్ని రోజులుగా ఈ వ్యవహారం అంతర్గతంగా నడుస్తున్నా ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ అనే టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆలయ మహా ద్వారం ముందు ఉన్న గేటు తీయకపోవడం ఇగోకు కారణమైంది. గేటు వద్ద ఉన్న బాలాజీ అనే ఉద్యోగి గేటు తీసేందుకు అంగీకరించకపోవడంతో చిర్రెత్తిన బోర్డు సభ్యుడు అగ్రహంతో ఊగిపోయాడు. గేటు తాళం తీయని బాలాజీ అనే ఉద్యోగిని దూషించడం చర్చకు మారింది. పాలకమండలి సభ్యుడిగా సరైన గౌరవం తనకు దక్కలేదన్న అక్కసుతో నరేష్ కుమార్ దుర్భాషలాడడంపై టీటీడీ ఉద్యోగ సంఘాలు తప్పు పడుతున్నాయి.

గతంలో వరాహస్వామి ఆలయం వద్ద కూడా ఇదే తరహాలో ఉద్యోగి తప్పు చేయకపోయినా సస్పెండ్ చేశారంటున్న ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగి పట్ల దురుసుగా వ్యవహరించిన పాలకమండలి సభ్యుడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం అవుతున్న ఉద్యోగ సంఘం నేతలు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఉద్యోగిపై దాడి ఘటనపై టీటీడీ పరిపాలన భవనంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మహాద్వారం వెలుపలకు వచ్చే మార్గం క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఈ మేరకు బోర్డు కూడా పెట్టారన్నారు. అయితే టీటీడీ ఉద్యోగి బాలాజీపై దురుసుగా ప్రవర్తించిన పాలక మండలి సభ్యుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసనకు సిద్ధమయ్యారు.

గత 3 నెలలుగా టీటీడీ ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయని, ఈ మధ్యనే పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి కూడా సూరి అనే ఉద్యోగిని బదిలీ చేయించారన్నారు. పడి కావలి వద్ద ఉద్యోగిని ఇబ్బంది పెట్టారన్నారు. ఇలాంటి సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘం నేతలు.. ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అంటున్నారు. ఇటీవల ఉద్యోగులపై అకారణంగా బదిలీవేటు వేసారని వారిని తిరిగి పునరుద్ధరించాలని టీటీడీ ఉద్యోగ సంఘం నేత వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ను కలుస్తామన్న టీటీడీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు.. చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బాలాజీ తోపాటు టీటీడీ ఉద్యోగులందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. బోర్డు సభ్యుడికి మహా ద్వారం ప్రవేశం లేదన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కు కేటాయించిన కారు, గెస్ట్ హౌస్, వెనక్కి తీసుకోవాలని టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.