Chittor: పంటకు రేటు ఉండటమే పాపమైపోయింది.. పాపం ఆ రైతు టమాటాలు అమ్ముకుని వస్తుండగా
టమోటా..ఇప్పుడో విచిత్ర పంటగా మారింది. కొందరికి జాక్ పాట్‌లా... ఇంకొందరికి కాసుల పంటలా మారింది. చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది టమోటా సాగు కొందరిని కోటీశ్వరుల్ని చేస్తే మరికొందరి ప్రాణాల పైకి తెచ్చింది. ఏంటి ఈ ఏడాది టమోటా సాగు ఇంత చిత్ర విచిత్రాల పంటగా మారడానికి కారణమేంటి.. అంటే ప్రధాన కారణం అనూహ్యంగా పెరిగిన ధరనే. ఈ ఏడాది మదనపల్లి టమోటా మార్కెట్ లో కిలో టమోటా ధర డబుల్ సెంచరీని దాటిపోవడంతో చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత టమాటా రైతాంగానికి పంట పండింది.
చిత్తూరు జిల్లా, ఆగస్టు 2: టమాట మోత మోగిస్తూనే ఉంది. మొన్నటి వరకు 10 రూపాయలకు దొరికే టమాట, ఇప్పుడు అందనంతగా మారిపోయింది. కిలో 150 నుంచి 200 వరకు పలుకుతుండడంతో ఏపీలో రైతు బజార్ల ద్వారా సబ్సిడీకి అందజేసే యత్నం చేస్తోంది ప్రభుత్వం. అయితే ఒకరికి ఒకే కిలో ఇస్తుండడంతో క్యూ లైన్లలో బార్లు తీరాల్సి వస్తోంది. పని వదులుకుని కిలో టమాట కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యావసరాల్లో టమాటది ప్రత్యేక స్థానం. ప్రతీ కూరలో టమాట ఉంటుంది. కనీసం ఒక కిలో అయినా తీసుకుందామనుకునే వారికి క్యూ కష్టాలు తప్పడం లేదు. కర్నూలు జిల్లా ఆదోనిలో రైతు బజార్లకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రజలు.
మార్కెట్ యార్డులో కిలో 50 రూపాయలకు టమాట ఇస్తుండడంతో.. పిల్లా పాపలతో తరలివచ్చారు. మహిళల ధీటుగా మగవారు కూడా క్యూలో నిలబడ్డారు. 200 రూపాయలు పెట్టి సామాన్యుడు టమాటను కొనే పరిస్థితి లేక వచ్చామని కొందరు చెప్పగా, మరికొందరు మూడు, నాలుగు కౌంటర్లు పెడితే బాగుండేదని అన్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడం కష్టంగా మారింది. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా లైన్లు పెట్టినప్పటికీ.. ఒకే కౌంటర్ ద్వారా ఇస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగైదు కౌంటర్లు ఓపెన్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సబ్సిడీ కింద ప్రభుత్వం 50 రూపాయలకు కిలో టమాటను ఇవ్వడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ.. క్యూను దృష్టిలో పెట్టుకుని కౌంటర్లను పెంచిదే బాగుండేదన్నారు మెజార్టీ ప్రజలు.
ఇక టమాటాలకు సంబంధించిన క్రైమ్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా చిత్తూరు…పుంగనూరు మండలంలో టమోటా రైతుపై దాడి జరిగింది. టమోటాలు విక్రయించగా వచ్చిన రూ.4.50 లక్షలను దుండగులు లాక్కెళ్లారు. పుంగనూరు మండలం నక్కబండ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధిత రైతు లోకరాజ్‌ను పుంగనూరు ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అతని తలకు తీవ్ర గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు బాటిల్స్‌తో తల పగల కొట్టి డబ్బు లాక్కెళ్లారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..