Tirupati: ఒక్క శాతమే అయినా కొండంత దుమారం
భక్తుల కానుకలతో వచ్చిన హుండీ నిధుల్ని కార్పొరేషన్‌కు ఎలా ఖర్చు చేస్తారు.. టీటీడీ నిధులను హారతి కర్పూరంలా కరిగించే ప్రయత్నమే ఇది అని ఆరోపిస్తోంది కమలం పార్టీ. విమర్శల తాకిడిని ఇంకాస్త పెంచేస్తూ... టీటీడీని ధార్మిక ధనార్జన కేంద్రంగా మార్చుకుంటున్నారని తీవ్రంగా విరుచుకుపడుతోంది బీజేపీ. బీజేపీ వాదనకు కోరస్ ఇస్తూ వీహెచ్‌పీ కూడా గొంతెత్తింది.

తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధుల కేటాయింపుపై రచ్చ కొనసాగుతోంది. తిరుమల బడ్జెట్లో ఒక శాతం సొమ్ము తిరుపతి కోసం ఖర్చు చేయాలన్న బోర్డు నిర్ణయాన్ని విమర్శించేవాళ్లకు దీటుగా ఇప్పుడు సమర్థించేవాళ్లు కూడా గొంతెత్తుతున్నారు. ఇది సామాజిక బాధ్యత అని టీటీడీ అంటుంటే.. కాదుకాదు… భక్తుల మనోభావాలకు తూట్లు పొడిచే ప్రయత్నం అంటోంది బీజేపీ. ఆపద మొక్కులవాడికి భక్తుల నుంచి వచ్చే విరాళాలతో ఏటా 4600 కోట్ల దాకా టీటీడీ ఖజానాలో చేరుతోంది. ఇందులో ఒక శాతం అంటే… దాదాపు 50 కోట్లు తిరుపతి కార్పొరేషన్‌కి ఖర్చు చేయాలన్నది టీటీడీ నిర్ణయం కరెక్టా కాదా అనే వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. దీంతో ఈ విషయం రాజకీయ రచ్చగా మారింది.
టీటీడీ నిధుల మళ్లింపు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది బీజేపీ. ప్రశ్నల మీదప్రశ్నలు సంధిస్తోంది. టీటీడీతో పాటు అధికార పార్టీని కూడా కార్నర్ చేస్తోంది.
–శ్రీవారి హుండీ డబ్బులపై మీ అతి పెత్తనమేంటి? తిరుమలేశుడి సొత్తు తిరుపతికి ధారాదత్తం చేస్తారా? అని నిలదీస్తోంది.
–ధర్మ ప్రచారం కంటే మిగతా ప్రయోజనాలే ముఖ్యమా? వడ్డీకాసులవాడి పైసలకే గండి కొడతారా? అని టీటీడీని కార్నర్ చేస్తోంది బీజేపీ,
–ఇప్పటికే తిరుపతిలో గరుడ ఫ్లైఓవర్‌కు వేల కోట్లు ఖర్చు చేశారు.. ఇది కూడా భక్తుల అవసరార్థమే కదా అని తేలిగ్గా తీసుకున్నాం. కానీ.. దీన్నొక అలవాటుగా మార్చుకుంటే ఊరుకునేది లేదంటోంది బీజేపీ.
–తిరుమల లేకపోతే తిరుపతి పరిస్థితి ఏంటి.. ఒక పంచాయితీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది… ప్రభుత్వానికి రాబడి పెరిగింది… ఆ క్రెడిట్ అంతా తిరుమలదే కదా అనేది బీజేపీ లాజిక్.
–శ్రీవారి నిధుల దారిమళ్లింపుపై బహిరంగ చర్చకొస్తారా? మీ తప్పుని మేం నిరూపిస్తాం.. ఆ తర్వాత ధర్మకర్తలందరూ జైలుకెళతారు అని ఘాటు పెంచింది బీజేపీ.
–ఇవాళ ఒక్క పర్సెంట్ అంటారు, వచ్చే ఏడాది ఐదు శాతం అంటారు.. తర్వాత ఇదొక అలవాటుగా మారుతుంది. మిగతా దేవాలయాల ట్రస్టులు కూడా ఇదే బాటలో నడుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకోవాలి.. అని డిమాండ్ చేస్తోంది బీజేపీ.
#saveTTD ..does Andhra Pradesh or any other state governments dare to ask fund from churches, mosques for the development of town? Then why they collect from hindu temples only. TTD has no right to spend 1% which is approximately 50cr of its budget for paying salaries of Tirupati… pic.twitter.com/tcxcNdoxD5
— Yamini Sharma Sadineni (@YaminiSharma_AP) October 11, 2023
భక్తుల కానుకలతో వచ్చిన హుండీ నిధుల్ని కార్పొరేషన్‌కు ఎలా ఖర్చు చేస్తారు.. టీటీడీ నిధులను హారతి కర్పూరంలా కరిగించే ప్రయత్నమే ఇది అని ఆరోపిస్తోంది కమలం పార్టీ. విమర్శల తాకిడిని ఇంకాస్త పెంచేస్తూ… టీటీడీని ధార్మిక ధనార్జన కేంద్రంగా మార్చుకుంటున్నారని తీవ్రంగా విరుచుకుపడుతోంది బీజేపీ. బీజేపీ వాదనకు కోరస్ ఇస్తూ వీహెచ్‌పీ కూడా గొంతెత్తింది. టీటీడీ అత్యుత్సాహాన్ని నిలదీస్తూ మీడియా ముందుకొచ్చింది. స్వామివారి నిధులతో ఆటలొద్దు అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది ధర్మాగ్రహ ఉద్యమం.
టీటీడీ నిధుల కేటాయింపును తిరుపతి పౌర సమాజం సంపూర్ణంగా స్వాగతిస్తోంది. తిరుపతికి చెందిన ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు అంతా ఒక్కటయ్యారు. టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బాలాజీ కాలనీలోరౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీల ప్రతినిధులూ పాల్గొన్నారు. అభినందన మందారమాల అంటూ ఛైర్మన్ భూమనకు ప్రశంసలతో సత్కారం చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. తిరుమల ఆధ్యాత్మికతకూ తిరుపతి అభివృద్ధికీ అవినాభావ సంబంధం ఉందనేది స్థానికుల వాదన.
పౌరసమాజం మద్దతు తెలిపిన తర్వాతే టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది తప్ప.. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదంటోంది తిరుపతి కార్పొరేషన్. తిరుమలకొచ్చే ప్రతీ భక్తుడూ తిరుపతిని స్పృశించిన తర్వాతే ఏడుకొండలు ఎక్కుతాడు.. మరి తిరుపతిని ఎలా నిర్లక్ష్యం చేస్తారు అని నిలదీస్తున్నారు డిప్యూటీ మేయర్ అభినయ్. తిరుపతిపై బీజేపీ కక్ష గట్టిందంటోంది వైసీపీ. రాజకీయ రాద్ధాంతం తగదని సూచించింది. గతంతో తిరుపతి అభివృద్ధిని అడ్డుకున్న చరిత్ర బీజేపీదే అనేది అధికార పార్టీ వాదన. గరుడ ఫ్లైఓవర్ నిర్మాణంపై కోర్టుకెళ్లారు బీజేపీవాళ్లు. కోర్టు కూడా వాళ్లకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. శ్రీనివాస సేతు నిర్మాణం ఆలస్యం కూడా బీజేపీ పాపమే! అని విమర్శిస్తోంది వైసీపీ.
తిరుపతిలో డ్రైనేజ్ వ్యవస్థ అధునీకరణకు సైతం గతంలో VHP మోకాలడ్డింది. ఇప్పుడు హుండీ నిధుల పేరుతో రాద్ధాంతం చేస్తోంది… అని స్థానిక వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తిరుమల-తిరుపతి దేవస్థానం…TTD… బోర్డు పేరులోనే ఉంది.. తిరుపతి-తిరుమల కలిస్తేనే శ్రీవారి దేవస్థానం. స్థల పురాణంలో కూడా జంట పుణ్యక్షేత్రాల ప్రస్తావన ఉంది… మరి శుద్ధ తిరుపతి అనే ప్రయత్నానికి అడ్డు తగులుతారెందుకు అంటోంది తిరుపతి పౌర సమాజం. హైందవ సమాజంలోని కొన్ని వర్గాలు మాత్రం తిరుమల వేరు, తిరుపతి వేరు.. నిధుల బదలాయింపుకు ససేమిరా అంటున్నాయి. ఈ వివాదం ఎక్కడికెళ్లి ఆగుతుందో అంతుబట్టని పరిస్థితి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..