Atchannaidu : విశాఖ స్టీల్ విషయంలో వైసీపీ ఎంపీలు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు : Tv9తో అచ్చెన్నాయుడు
Atchannaidu : తిరుపతి ఎంపీ బై ఎలక్షన్లకు సంబంధించి తాము ముందే అభ్యర్థిని ప్రకటించామని, ప్రభుత్వ వైఫల్యాలపై..
Atchannaidu : తిరుపతి ఎంపీ బై ఎలక్షన్లకు సంబంధించి తాము ముందే అభ్యర్థిని(పనబాక లక్మి) ప్రకటించామని, ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీవీ9తో చెప్పారు. తిరుపతిలో మమ్మల్ని గెలిపిస్తే ప్రజావాణి పార్లమెంట్లో వినిపిస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు. “దౌర్జన్యాలు చేసి స్థానిక ఎన్నికల్లో గెలిచారు.. స్థానిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదు. తిరుపతి ఎన్నికల్లో మేము కచ్చితంగా గెలుస్తాము.” అని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు లేకుండా పోలీసులను ఉపయోగించి, దౌర్జన్యం చేసి వైసీపీ నేతలు గెలిచారని, 2019లో మాయ మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాడని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒక్క అవకాశం అని అడిగినందుకు గెలిపిస్తే, రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కి పోతున్నాయని అచ్చెన్న అన్నారు. “22 మంది ఎంపీలు ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేక పోయారు.. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టంగా చెప్పింది.. వైసీపీ ఎంపీలు ఏమి చేస్తున్నారు..? గోడమీద పిల్లిలా ఒక్క మాట మాట్లాడలేదు.” అని అచ్చెన్న జగన్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. తాము మద్దతు ఉపసంహరించుకొని కేంద్రం నుంచి బయటకు వచ్చాము.. పార్లమెంట్ లో ఏ అంశం అయినా టీడీపీ ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు అని అచ్చెన్నాయుడు అన్నారు.