kanipakam Temple: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో దొంగలు.. బంగారు విభూదిపట్టి మాయం
వేలూరు గోల్డెన్ టెంపుల్‌కు చెందిన నారాయణి శక్తిఅమ్మణ్ ఈ బంగారు విభూదిపట్టీని కానుకగా ఇచ్చారు. అప్పుడే రసీదు ఇవ్వాల్సిన పాలకమండలి డిలే చేసింది. ఆలయ అధికారులు, అర్చకులు అంతా నిర్లక్ష్యంగానే వ్యవహరించిన..
కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విలువైన ఆభరణం మాయమవడం సంచలనంగా మారింది. ఇటీవల ఓ భక్తుడు స్వామివారికి బంగారు విభూది పట్టీ కానుకగా ఇచ్చారు. ఈ బంగారు విభూది పట్టి విలువ సుమారు రూ. 18 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. దీనిని ఆగష్టు 27న కాణిపాకం ఆలయ పునర్నిర్మాణం సమయంలో నిర్వహించిన మహా కుంభాభిషేకం రోజు స్వామివారికి అలంకరించారు. తర్వాత బ్రహ్మోత్సవాల్లోను వాడారు. తాను కానుకగా ఇచ్చిన దానికి సంబంధించిన రసీదు ఇవ్వాలని దాత అడగడంతో.. అప్పుడు ఈ ఆభరణం మిస్సైన విషయం వెలుగులోకి వచ్చింది.
వేలూరు గోల్డెన్ టెంపుల్‌కు చెందిన నారాయణి శక్తిఅమ్మణ్ మహా కుంభాభిషేకంలో పాల్గొని ఈ బంగారు విభూదిపట్టీని స్వామివారికి కానుకగా ఇచ్చారు. అప్పుడే రసీదు ఇవ్వాల్సిన పాలకమండలి డిలే చేసింది. ఆలయ అధికారులు, అర్చకులు అంతా నిర్లక్ష్యంగానే వ్యవహరించిన ఫలితంగా ఇప్పుడది కనిపించకుండా పోయింది. 20 రోజుల క్రితం ఈ విభూదిపట్టీ మాయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు దాత. విషయం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి రావడంతో దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.
కాణిపాకం వినాయకుడికి వచ్చే కానుకలు, ఆభరణాలు, ఇతరత్రా లెక్కలన్నీ పక్కాగా నిర్వహించాల్సిన పాలకమండలి 18 లక్షల విలువైన వస్తువు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు…. ఇంతకీ ఆ ఆభరణం ఏమైనట్టు అనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..