AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మోసాలలో ఘరానా మోసాలు వేరయా..! ఇలా వచ్చి.. అలా చెక్కేశాడు..!

ఎంతసేపటికి ఆ వ్యక్తి రాకపోవడంతో అతని వెంట వెళ్లిన యువకుడు తిరిగి వచ్చి దుకాణ యజమానికి జరిగింది చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించాడు.

Andhra Pradesh: మోసాలలో ఘరానా మోసాలు వేరయా..! ఇలా వచ్చి.. అలా చెక్కేశాడు..!
Gold Theft
Fairoz Baig
| Edited By: |

Updated on: Oct 27, 2024 | 8:39 PM

Share

మోసాలలో ఘరానా మోసాలు వేరయా అంటున్నాడు ఆ ఘరానా మోసగాడు. మోసాలు చేయడంలో నేరస్తులు సిద్దహస్తులుగా మారిపోతున్నారు. ఇటీవల వ్యాపారులను బురిడీ కొట్టించి అందినకాడికి దండుకునే రకాలు ఎక్కువయ్యారు. రకరకాల మార్గాలలో ప్రజల సొమ్ము ఏదో ఒక విధంగా కాజేసేందుకు దొంగలు, మోసగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అచ్చం ఇటువంటి ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

ఓ మోసగాడు అధికారి అవతారమెత్తి ద్దలూరు పట్టణంలోని బంగారు వ్యాపారికి టోకరా వేశాడు. పట్టణంలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ సమీపంలో ఉన్న ఓ బంగారు దుకాణంలో ఉంగరాలు కావాలంటూ వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి, తాను విద్యుత్తు శాఖ అధికారిగా దుకాణ యజమానిని పరిచయం చేసుకున్నాడు. తర్వాత బంగారం కొనుగోలు చేసేందుకు దుకాణ యజమానితో బంగారు ఉంగరాలు చూపించాలన్నాడు. మంచి బేరం తగిలిందనుకుని దుకాణ యజమాని రకరకాల బంగారు ఉంగరాలు చూపించాడు. తర్వాత అపరిచిత వ్యక్తి తనకు రెండు బంగారు ఉంగరాలు నచ్చాయని తీసుకున్నాడు. ఆ తరువాతే అసలు వ్యవహారం నడిపించాడు.

లక్ష రూపాయల విలువ చేసే రెండు ఉంగరాలు తీసుకున్న ఆ వ్యక్తి డబ్బులు మర్చిపోయి వచ్చానని తనతో ఎవరినైనా పంపిస్తే నగదు ఇచ్చి పంపుతానని దుకాణ యజమానిని నమ్మబలికాడు. దుకాణంలో పనిచేసే యువకుడిని పిలిచి బంగారు ఉంగరాలు కొనుగోలు చేసిన వ్యక్తి వెంట దుకాణ యజమాని పంపాడు. కొంచెం దూరం వెళ్లాక ఇక్కడే ఉండాలని ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకువస్తానని, ఆ యువకుడికి చెప్పి అపరిచిత వ్యక్తి ఉడాయించాడు.

ఎంతసేపటికి ఆ వ్యక్తి రాకపోవడంతో అతని వెంట వెళ్లిన యువకుడు తిరిగి వచ్చి దుకాణ యజమానికి జరిగింది చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన దుకాణ యజమాని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన అపరిచిత వ్యక్తిని సీసీ ఫుటేజ్ లో గుర్తించి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విద్యుత్ శాఖ అధికారి ముసుగులో పరిచయం చేసుకున్న మోసగాడు గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మరికొన్ని మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..