AP News: తెల్లవారుజామున శ్మశానం నుంచి వింత శబ్దాలు.. అటుగా వెళ్తున్న రైతులు భయం.. భయంగా.!
తెల్లవారు జామున శ్మశానవాటిక నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అవి తగ్గుతాయని అనుకుంటే.. క్రమేపీ పెద్దవి అవుతున్నాయి. పెద్ద.. పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. ఇక కొంతమంది రైతులు అటుగా వెళ్తూ.. వాటిని విన్నారు. ఏంటని దగ్గరకు వెళ్లి చూడగా.. దెబ్బకు ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

దొంగతనానికి ఏదీ కాదు అనర్హం అన్నట్లు తయారైంది పలువురు దొంగల తీరు. ఇప్పటివరకు ఇళ్లల్లో, దుకాణాల్లో, బ్యాంకుల్లో దొంగతనాలు చేయడం చూశాం. కానీ ఇప్పుడు శ్మశానాలను కూడా వదలటం లేదు ఈ కేటుగాళ్లు. అలాంటి అరుదైన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లిమర్ల మండలం జరజాపుపేట సమీప గ్రామానికి అనుసంధానంగా ఓ శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఆ గ్రామంతో పాటు అక్కడికి సమీపంలోని పలు ప్రాంతాల వారు అక్కడే దహన సంస్కారాలు చేస్తుంటారు. ఈ శ్మశాన వాటికను ఇటీవల జరజాపుపేట గ్రామస్తులతో పాటు పలువురు దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత శ్మశాన ప్రహరీ గోడతో పాటు పలు రకాల పరికరాలు, అంత్యక్రియలకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్మశానంలో బీడుతో కూడిన దహన వాటికను ఏర్పాటు చేశారు. ఈ బీడుతో కూడిన దహన వాటిక లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఈ దహన వాటికలోనే మరణించిన వారి మృతదేహాలను దహనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే దొంగల కన్ను ఈ దహన వాటికపై పడింది.
బీడుతో కూడిన దహన వాటిక విలువైనది కావడంతో ఎలాగైనా సరే ఈ దహనవాటికను కాజేయాలని ప్రణాళిక రూపొందించారు దొంగలు. అందులో భాగంగా అర్ధరాత్రి సమయంలో శ్మశాన వాటికకు చేరుకొని దహనవాటికను ముక్కలు ముక్కలుగా విరగొట్టడం ప్రారంభించారు. దహన వాటికను పూర్తిగా విడగొట్టి ఆ తర్వాత ముక్కలను తీసుకెళ్లి అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు. అలా దహన వాటికను విరగొట్టే క్రమంలోనే తెల్లారిపోయింది. అయినా వారి పని మాత్రం ఆపలేదు. అయితే తెల్లవారుజామున పలువురు రైతులు స్మశాన వాటిక ప్రక్క నుంచి పంట పొలాలకు వెళ్తున్నారు. ఆ సమయంలో వారికి స్మశాన వాటిక నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే అనుమానం వచ్చిన రైతులు కేకలు వేయడంతో దొంగలు దహన వాటిక ముక్కలను అక్కడే వదిలేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జిల్లాలో శ్మశానంలో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు పెద్ద పెద్ద షోరూమ్‌ల నుండి చిన్న పాన్ షాప్‌ల వరకు దొంగతనాలు జరగడం చూశాం కానీ శ్మశానంలో దొంగతనం ఏంట్రా బాబు అని ఆశ్చర్యంతో తలలు పట్టుకుంటున్నారు.
ఇది చదవండి: అలెర్ట్.! ఏపీలోని ఆ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.. పూర్తి వివరాలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
