ఆంధ్రాలోని ఆ పట్టణానికి ఈ రోజే స్వాత్రంత్య్ర దినోత్సవం.. అమర వీరులకు ఘన నివాళులు..

Independence Day: సువిశాల ఈ భారతదేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలను యావత్ దేశ ప్రజలు జరుపుకుంటారు. అయితే భారతదేశం కంటే ముందుగానే భారత్‌లోని ఓ ప్రదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మీకు తెలుసా..? ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 కంటే మూడు రోజుల ముందుగానే అంటే ఆగస్టు 12న అక్కడ స్వాతంత్య్ర వేడుకలు కూడా జరుగుతాయి. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడో కాదు.. గుంటూరు జిల్లాలోని తెనాలి. అవును, తెనాలికి దేశం కంటే ముందుగానే స్వాతంత్య్రం వచ్చింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆంధ్రాలోని ఆ పట్టణానికి ఈ రోజే స్వాత్రంత్య్ర దినోత్సవం.. అమర వీరులకు ఘన నివాళులు..
Rana Rang Chowk In Tenali
Follow us
T Nagaraju

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 12, 2023 | 9:53 PM

తెనాలి, ఆగస్టు 12: అది 1942.. స్వాత్రంత్య్రం సంగ్రామంలో భాగంగా గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. బాపూజీ పిలుపునందుకున్న సమర యోధులు అంతా ఉద్యమంలోకి దిగారు. ముంబై సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలను బ్రిటీష్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెనాలి నేతలు పట్టణంలో సమావేశమయ్యారు. ఆగష్టు 12వ తేదిన గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఉద్యమకారులు సమావేశమై ఆందోళన బాట పట్టారు. పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వటంఒక వైపు, ముఖ్యనేతల అరెస్టులు మరోవైపు.. దీంతో ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికేలా చేశాయి.

దీంతో పెద్ద గుంపుగా బయలు దేరిన ఉద్యమకారులు రైల్వే స్టేషన్ సమీపంలో తెరిచి ఉన్న హోటల్‌లోని ఫర్నిచర్‌ను బయట పడేశారు. పండ్ల దుకాణాలను, చిన్న చిన్న షాపులను మూసి వేయించారు. అటు నుండి రైల్వే స్టేషన్‌లోకి అడుగు పెట్టిన ఉద్యమకారులు ఆయిల్ ట్యాంకర్‌కు నిప్పు పెట్టారు. గూడ్స్ వ్యాగన్స్‌లో ఉన్న దక్కడన్ సిగరెట్ బండిల్స్ కుప్పగా పోసి నిప్పంటించారు. అదే సమయంలో చెన్నై నుండి వచ్చిన ఫ్యాసింజర్ రైలులో ఉన్న ప్రయాణికులను దింపి నాలుగు బోగీలకు నిప్పు పెట్టారు. రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన ఉద్యమకారులు సబ్ ట్రెజరీ కార్యాలయం వైపు వెళ్లేందుకు సిద్దమయ్యారు.

అడ్డుకున్నబ్రిటీష్ కలెక్టర్..

తెనాలి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారులు సబ్ ట్రెజరీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. అయితే అప్పటి బ్రిటీష్ కలెక్టర్, ఎస్పీ పోలీసు బలగాలతో ఉద్యమ కారులను అడ్డుకున్నారు. అయితే అవేశంలో ఉన్న స్వాత్రంత్య్ర సమర యోధులు సమీపంలో ఉన్న కట్టెల అడితిలోని కట్టెలను తీసుకొని పోలీసులపైకి వెళ్లారు. వెంటనే కలెక్టర్ ఫైరింగ్‌కు ఆదేశాలిచ్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశమంతా పాకిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దీనిపై చర్చలు జరిగాయి. ఈ ఘటనలో పాల్గొన్న అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ జైళ్లకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మూడేళ్లకు స్వాత్రంత్య్రం.

ఈ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత అంటే 1947 ఆగష్టు 15న దేశానికి స్వాత్రంత్య్రం వచ్చింది. తెనాలిలో ఏడుగురు అసువులు బాసిన ప్రాంతానికి రణరంగ చౌక్ అని పేరు పెట్టారు. పన్నెండు ఏళ్ల తర్వాత 1959లో అమర వీరులకు గుర్తుగా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక శిల్పి చిన్నాల రంగారావు తెలుగు తల్లి విగ్రహాన్ని చెక్కి ఇచ్చారు. కామరాజ్ నాడార్, నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దామెదరం సంజీవయ్య వంటి ప్రముఖ నేతలు ఈ స్థూపం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ముందే స్వాత్రంత్య్రం..

అప్పటి నుండి దేశం మొత్తం స్వాత్రంత్య్ర దినోత్సవం జరుపుకోవటానికి మూడు రోజుల ముందే తెనాలిలో స్వాత్రంత్య్ర వేడుకలు జరుగుతాయి. అమర వీరుల త్యాగాలకు గుర్తుగా ప్రజా ప్రతినిధులు అధికారులు ఆగష్టు 12 తేదిన అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మంత్రి అంబటి రాంబాబు అమర వీరుల స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని వీరుల త్యాగ ఫలితాన్ని కొనియాడారు. భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు.