Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP vs YCP: పట్టాభిని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు..

TDP vs YCP: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే టీడీపీ నేత పట్టాభి రామ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేశామని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు పట్టాభి రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

TDP vs YCP: పట్టాభిని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు..
Pattabhi
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2021 | 5:37 AM

TDP vs YCP: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే టీడీపీ నేత పట్టాభి రామ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేశామని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు పట్టాభి రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ రిమాండ్‌ రిపోర్ట్ టీవీ9 చేతికి అందింది. అందులో చాలా కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. పట్టాభిని అరెస్ట్ చేయడానికి గల బలమైన కారణాలను పేర్కొన్నారు. మరి ఆ కారణాలేంటి? రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

‘‘శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే పట్టాభిని ముందస్తు అరెస్ట్ చేశాం. నిందితుడిని అరెస్ట్ చేయకపోతే మరిన్ని బెదిరింపులు, ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రాజకీయ లబ్ధి పొందేందుకే పట్టాభి రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజా సంఘాలు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉంది. పట్టాభి మాట్లాడిన భాష శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పాలనను అవమానం కలిగించేలా పట్టాభి మాట్లాడారు. రాష్ట్రంలో కులాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. కొన్ని రాజకీయ పార్టీలు కూడా పట్టాభి వ్యాఖ్యలకు మద్దతు తెలిపాయి. నిరసనల వల్ల పట్టాభి ప్రవర్తన మరింత పునరావృతం అయ్యే అవకాశం ఉంది. పట్టాభి ఇప్పటికే 4 కేసుల్లో నిందితుడు. పట్టాభి స్టేట్మెంట్ కారణంగా అనేక అల్లర్లు జరిగాయి. పోలీసులపై కూడా హత్యాయత్నం చేసే స్థాయికి అల్లర్లు వెళ్లాయి.’’ అని పోలీసులు పట్టాభి రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నవంబర్ 2 వరకు టీడీపీ నేత పట్టాభికి రిమాండ్ విధిస్తూ కోర్టు వెల్లడించింది. బుధవారం పట్టాభి అరెస్ట్‌ అనంతరం ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పట్టాభిని హాజరు పర్చగా.. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీనికి ముందు పట్టాభి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి కి వివరణ ఇచ్చారు. అప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడిచేశారని పేర్కొన్నారు. తాను సీఎంని గానీ ప్రభుత్వంలో ఉన్న వారిని గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని వివరించారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించానంటూ న్యాయమూర్తికి పట్టాభి వివరించారు.

తాను విద్వేషాలు రెచ్చ గొట్టేలా మాట్లాడలేదని.. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్‌ పరిశీలించాలంటూ న్యాయమూర్తిని పట్టాభి వేడుకున్నారు. తనకు నోటీస్ ఇవ్వకుండానే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. కాన్ఫెషన్ స్టేట్మెంట్లో మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారు అంటూ న్యాయమూర్తికి పట్టాభి వివరించారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించిన అనంతరం పట్టాభిని.. మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.

Also read:

Telangana: ఛీ.. వీడసలు మనిషేనా?.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలను ఆదుకుంటానని చెప్పి..

Telangana Crime: ప్రేమ పేరుతో వేధింపులు.. అది తెలిసి యువతి బంధువులు ఏం చేశారంటే..

TDP vs YCP: ఏపీ గవర్నర్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్..