AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం

మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ KCMBకి తెలంగాణ మరో లేఖాస్త్రాన్ని సంధించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు సమీకృత రూల్ కర్వ్ అవసరమంటోంది.

AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం
Ap Ts Waters
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 22, 2021 | 6:57 AM

Water Dispute – Bachawat Tribunal: మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ KCMBకి తెలంగాణ మరో లేఖాస్త్రాన్ని సంధించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు సమీకృత రూల్ కర్వ్ అవసరమంటోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా నదీ యాజమాన్యబోర్డు -KRMB ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌ లేఖ రాశారు.

ప్రాజెక్టుల స్వాధీనం కోసం కేఆర్‌ఎంబీ ప్రతిపాదనల్లోని రూల్‌ కర్వ్స్‌, ఆపరేషన్ ప్రొటోకాల్స్‌ను నిపుణుల కమిటీ ఈనెల 20న పరిశీలించిందన్న రజత్ కుమార్.. అవన్నీ బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. జల విద్యుత్‌ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి బేసిన్‌ వెలుపలకు నీటిని మళ్లించరాదని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. దీన్ని మార్చే అధికారం కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి లేదని లేఖలో స్పష్టం వివరించారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ అవార్డు అమల్లోకి వచ్చే వరకు బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డును పూర్తి స్థాయిలో పాటించాల్సిందేనన్న రజత్‌ కుమార్‌.. అంతర్రాష్ట్ర ఒప్పందం, ప్రణాళికాసంఘం ఆమోదం ప్రకారం శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకోవాలన్నారు.

సగటు వినియోగం లెక్కించేందుకు 2014-15 నుంచి ఏడేళ్ల సగటును తీసుకోవడం బచావత్‌ అవార్డుకు విరుద్ధమన్నారు రజత్ కుమార్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా అక్రమంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్న ఏపీ వాదనకు బలం చేకూర్చినట్లవుతుందన్నారు. పరీవాహక ప్రాంతం లేకపోయినా రెండు రాష్ట్రాల తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం నాగార్జున్ సాగర్ కీలకమని రజత్ కుమార్ అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నుంచి విడుదలయ్యే నీరు నాగార్జున సాగర్‌కు వెళ్తోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు సమీకృతంగా రూల్ కర్వ్ అవసరమని తెలిపారు.

Read also: Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ