TDP: మౌనం దేనికి సంకేతం.? ఫ‌లితాల‌పై నోరు విప్పని టీడీపీ ముఖ్య నేత‌లు..

ఎన్నిక‌లు ముగిసి రోజులు గ‌డుస్తున్నాయి. ఫ‌లితాలు కూడా త్వర‌లోనే రానున్నాయి. మ‌రి ఫ‌లితాల‌పై తెలుగు త‌మ్ముళ్ల మౌనం ఎందుకు? అధినేత నుంచి కింది స్థాయి నాయ‌కుల వ‌ర‌కు నోరు మెద‌ప‌క‌పోవ‌డం వెనుక కార‌ణం ఏంటి.? మౌనం గెలుపున‌కు అంగీకార‌మా.? లేక పార్టీ స్ట్రాట‌జీలో భాగ‌మా.? అస‌లేం జ‌రుగుతందో తెలియ‌క ప‌సుపు నేత‌లు డైల‌మాలో ప‌డిపోయార‌ట‌. తెలుగుదేశం పార్టీ కేడ‌ర్‎లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొద‌లైంద‌ట‌.

TDP: మౌనం దేనికి సంకేతం.? ఫ‌లితాల‌పై నోరు విప్పని టీడీపీ ముఖ్య నేత‌లు..
Telugudesam
Follow us
pullarao.mandapaka

| Edited By: Janardhan Veluru

Updated on: May 27, 2024 | 5:02 PM

ఎన్నిక‌లు ముగిసి రోజులు గ‌డుస్తున్నాయి. ఫ‌లితాలు కూడా త్వర‌లోనే రానున్నాయి. మ‌రి ఫ‌లితాల‌పై తెలుగు త‌మ్ముళ్ల మౌనం ఎందుకు? అధినేత నుంచి కింది స్థాయి నాయ‌కుల వ‌ర‌కు నోరు మెద‌ప‌క‌పోవ‌డం వెనుక కార‌ణం ఏంటి.? మౌనం గెలుపున‌కు అంగీకార‌మా.? లేక పార్టీ స్ట్రాట‌జీలో భాగ‌మా.? అస‌లేం జ‌రుగుతందో తెలియ‌క ప‌సుపు నేత‌లు డైల‌మాలో ప‌డిపోయార‌ట‌. తెలుగుదేశం పార్టీ కేడ‌ర్‎లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొద‌లైంద‌ట‌. పోలింగ్ జ‌రిగి అప్పుడే రెండు వారాలు గ‌డిచినా.. పార్టీ నేత‌ల్లో ఒకప్పటి ఉత్సాహం క‌న‌బ‌డ‌టం లేద‌ట‌. దీనికి కార‌ణం ఏంటో తెలియ‌క ప‌సుపు పార్టీ కార్యక‌ర్తలు తెగ మ‌దన ప‌డిపోతున్నారు. ఎన్నిక‌లు జ‌రిగిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కూ ఫలితాల విష‌యంలో ఆ పార్టీ నేత‌లెవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం వెనుక అసలు కార‌ణం ఏంటా అని ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌. పోలింగ్‎కు ముందు వ‌ర‌కూ తామే అధికారంలోకి వ‌స్తున్నామంటూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇత‌ర నేత‌లు కూడా తెగ ఊద‌ర‌గొట్టేవారు. ఎన్నిక‌ల ప్రచారంలో కూడా ఇంకేముంది అధికారంలోకి వ‌చ్చేశాం అనే విధంగా మాట్లాడేవారు. అలాంటిది ఇన్ని రోజులుగా మౌనం వ‌హించ‌డం వెనుక వ్యూహ‌మా లేక ఇంకేదైనా కార‌ణం ఉందా అని చ‌ర్చించుకుంటున్నారు..

గ‌తంలో ఎన్నిక‌లు జ‌రిగిన రోజు లేదా ఆ మ‌ర్నాడు పార్టీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొచ్చేవారు. ఫ‌లితాలు ఎలా వ‌స్తాయ‌నేది ఊహిస్తూ త‌మ గెలుపుపై కామెంట్స్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు చిన్నమాట కూడా మాట్లాడ‌లేదు. ప్రధాని మోడీ నామినేష‌న్ స‌మ‌యంలో వార‌ణాసి వెళ్లిన‌ప్పుడు మాత్రమే ఓ ఇంగ్లీష్ చాన‌ల్‎తో మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు. అది మిన‌హా ఇంకెక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ త‌ర్వాత చంద్రబాబు విదేశీ ప‌ర్యట‌న‌కు వెళ్లిపోయారు. ఇక నారా లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి వారు కూడా గెలుపుపై ఎలాంటి ప్రక‌ట‌న‌లు చేయ‌లేదు. ఇక పార్టీలో ఉన్న ఇద్దరుముగ్గురు నేత‌లు మాత్రం రాష్ట్రంలో జ‌ర‌గుతున్న రోజువారీ ప‌రిణామాల‌పై ఈసీని లేదా డీజీపీని క‌లిసి ఫిర్యాదులు చేయ‌డం మిన‌హా ప్రభుత్వం ఏర్పాటుపై చిన్నమాట కూడా మాట్లాడ‌టం లేదు.

నేత‌ల మౌనంతో తెలుగు త‌మ్ముళ్లలో టెన్షన్..

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు గెలుపుపై ధీమాగా ముందుకెళ్తున్నారు. గ‌త ఎన్నిక‌ల కంటే ఈసారి మ‌రింత మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయంటూ ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలు మ‌రింత కాక‌పుట్టించాయి. ఓవైపు అధికార పార్టీ త‌మ‌కున్న అంచ‌నాల‌తో వేగంగా ముందుకెళ్తుంటే త‌మ పార్టీ నేత‌లు మౌనం ఎందుకు వ‌హిస్తున్నారో తెలియ‌క‌ తెలుగు త‌మ్ముళ్లు టెన్షన్ ప‌డిపోతున్నారట‌. అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు మాత్రం స్థానిక ప‌రిస్థితుల ఆధారంగా గెలుపోట‌ముల‌పై ఇప్పటికే కేడ‌ర్‎కు కొన్ని సంకేతాలు ఇస్తున్నార‌ట‌. అయితే త‌మ నేత‌ల మౌనం గెలుపున‌కు కార‌ణం అని చెబుతున్నార‌ట. తిన‌బోతూ రుచులెందుక‌ని.. అధికారంలోకి వ‌చ్చే స‌మయంలో అన‌వ‌స‌ర ప్రక‌ట‌న‌లు ఎందుకులే అని మౌనంగా ఉన్నార‌ట. త‌మ‌కున్న నివేదిక‌లు, స‌ర్వేల ప్రకారం మంచి స్థానాలు వ‌స్తున్నాయ‌ని ముఖ్య నేత‌ల‌కు స‌మాచారం ఇస్తున్నార‌ట‌. కానీ బ‌హిరంగంగా ఎలాంటి ప్రక‌ట‌న‌లు చేయొద్దని కూడా చెబుతున్నార‌ట‌. టీడీపీతో పాటు మిత్రప‌క్షంగా ఉన్న జ‌న‌సేన‌,బీజేపీ నేత‌లు కూడా అస‌లు ఎన్నిక‌ల‌పై మాట మాత్రం మాట్లాడ‌క‌పోవ‌డం మ‌రింత చ‌ర్చకు దారి తీస్తుంది. పార్టీ నేత‌ల అంచ‌నాలు ఎలా ఉన్నా.. కౌంటింగ్ స‌మ‌యం ద‌గ్గర పడుతుండ‌టంపై మ‌రింత ఆందోళ‌న చెందుతున్నార‌ట ప‌సుపు పార్టీ కేడ‌ర్. అయితే పార్టీ పెద్దల మౌనం ఎలాంటి ఫ‌లితాల‌కు దారి తీస్తుందోన‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు కార్యకర్తలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..