AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీమలో ఒక్క సీటుకు అభ్యర్థిని ప్రకటించని జనసేన.. అక్కడ పార్టీల ఈక్వేషన్స్ ఇవే

అనంతపురం జిల్లాలోని 14 సీట్లకు గాను 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. కీలకమైన ఐదు సీట్లు పెండింగ్‌లో పెట్టటంతో ఫైనల్‌ లిస్ట్‌లో సమీకరణాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. అనంతపురం అర్బన్‌, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, గుంతకల్‌ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో ఎక్కడ టీడీపీ పోటీచేస్తుంది.. ఏయే సీట్లు మిత్రపక్షాలకు ఇస్తుందన్నదే సస్పెన్స్‌.

సీమలో ఒక్క సీటుకు అభ్యర్థిని ప్రకటించని జనసేన.. అక్కడ పార్టీల ఈక్వేషన్స్ ఇవే
Janasena - TDP Leaders
Ram Naramaneni
|

Updated on: Feb 24, 2024 | 5:05 PM

Share

రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలకు గాను 29 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. విచిత్రంగా సీమలో ఒక్క సీటుకు కూడా జనసేన అభ్యర్థిని ప్రకటించలేదు. సీమలో 2019 ఎన్నికల్లో టీడీపీనుంచి గెలిచిన ముగ్గురు అభ్యర్థులు మళ్లీ బరిలో నిలుస్తున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మరోసారి పోటీలో ఉంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7 స్థానాలు, కడప జిల్లాలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 9 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. రాయలసీమలో మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, ఎన్ఎండి ఫరూక్, పరిటాల సునీత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి టికెట్లు ప్రకటించారు.

అనంతపురం జిల్లాలోని 14 సీట్లకు గాను 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. కీలకమైన ఐదు సీట్లు పెండింగ్‌లో పెట్టటంతో ఫైనల్‌ లిస్ట్‌లో సమీకరణాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. అనంతపురం అర్బన్‌, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, గుంతకల్‌ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో ఎక్కడ టీడీపీ పోటీచేస్తుంది.. ఏయే సీట్లు మిత్రపక్షాలకు ఇస్తుందన్నదే సస్పెన్స్‌. అనంతపురం అర్బన్‌ సీటుని జనసేన బలంగా కోరుకుంటోంది. అయితే పవన్‌కల్యాణ్‌ పోటీలో ఉంటేనే సీటు త్యాగం చేస్తానని గతంలోనే కండిషన్‌ పెట్టారు ఇక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి. పరిటాల శ్రీరాం ఇన్‌ఛార్జిగా ఉన్న ధర్మవరం సీటు ఎవరికన్నది మరో చర్చ. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఉండటంతో ఆ సీటుపై కన్నేసింది బీజేపీ. పొత్తుంటే ఓ లెక్క..లేకపోతే మరో లెక్కన్నట్లు ఉండబోతోంది ధర్మవరం రాజకీయం. గుంతకల్‌ సీటుని గుమ్మనూరు జయరాంకోసం రిజర్వ్‌ చేసి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీని వీడే ఆలోచనలో ఉన్న మంత్రి టీడీపీలో చేరితే గుంతకల్‌ సీటు కోరుకుంటున్నారు. ఇక పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉన్నా.. ఇక్కడ బీసీ అభ్యర్థిని దించాలన్న ఆలోచనతో ఉంది టీడీపీ అధిష్ఠానం. అందుకే ఆ సీటు సంగతి కూడా ఇంకా తేల్చలేదు. వైసీపీ ముస్లిం అభ్యర్థిని ప్రకటించటంతో కదిరిని కూడా హోల్డ్‌లో పెట్టింది టీడీపీ.

పెనుకొండలో రచ్చ…

శ్రీసత్యసాయిజిల్లా టీడీపీలో టికెట్ల రచ్చ పీక్స్‌కి చేరింది. పెనుకొండలో చంద్రబాబుకి వ్యతిరేకంగా తెలుగుతమ్ముళ్లు ఆందోళనకు దిగారు. పెనుకొండ టికెట్‌ సవితకు కేటాయించారు చంద్రబాబు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు. ఇక బీకే పార్థసారథి కంట తడి పెట్టారు. అభ్యర్థుల ప్రకటనతో కల్యాణదుర్గం టీడీపీలో కూడా అసమ్మతి మొదలైంది. ఈ స్థానం నుంచి అభ్యర్థిగా సురేంద్రబాబు పేరును ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. దీంతో హనుమంతరాయ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్‌లో టీడీపీ జెండాలను హనుమంతరాయ వర్గీయులు తొలగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…