AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP-Janasena: టీడీపీ – జనసేన కూటమి టికెట్ల ప్రకటనతో భగ్గుమన్న నిరసనలు.. అజ్ఞాతంలోకి నేతలు..!

అసెంబ్లీ టికెట్లు ప్రకటనతో విజయనగరం జిల్లాలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. మొదటినుండి టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులు అవకాశం దక్కకపోవడంతో నిరసనలకు దిగారు. గజపతినగరం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడును ప్రక్కనబెట్టి కొండపల్లి శ్రీనివాసరావు అనే కొత్త అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ.

TDP-Janasena: టీడీపీ - జనసేన కూటమి టికెట్ల ప్రకటనతో భగ్గుమన్న నిరసనలు.. అజ్ఞాతంలోకి నేతలు..!
Tdp Jana Sena Alliance
Gamidi Koteswara Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 24, 2024 | 4:17 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు..అందులో టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో, మూడు పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేన పోటీ చేయబోతోంది. అయితే ఇప్పుడు మాత్రం 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించారు పవన్‌ కల్యాణ్.

అసెంబ్లీ టికెట్లు ప్రకటనతో విజయనగరం జిల్లాలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. మొదటినుండి టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులు అవకాశం దక్కకపోవడంతో నిరసనలకు దిగారు. గజపతినగరం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడును ప్రక్కనబెట్టి కొండపల్లి శ్రీనివాసరావు అనే కొత్త అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. దీంతో డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల ప్రకటన జరిగిన వెంటనే కార్యకర్తలతో సమావేశమయ్యారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

2006లో బొబ్బిలి ఎంపీగా కొండపల్లి పైడితల్లి నాయుడు ఆకస్మిక మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో పైడితల్లి నాయుడు రాజకీయ వారసుడిగా ఆరంగ్రేటం చేసి ఉపఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు కొండపల్లి అప్పలనాయుడు. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన కేఏ నాయుడు తరువాత 2014లో గజపతినగరం నుండి పోటీచేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2019లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి బొత్స అప్పల నరసయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుండి నియోజకవర్గంలో ఇంచార్జిగా కొనసాగుతూ పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.

అయితే ప్రస్తుతం కె ఏ నాయుడును పక్కనబెట్టిన టీడీపీ అధిష్టానం ఆయన సోదరుడు కొండపల్లి కొండలరావు తనయుడు శ్రీనివాసరావును రానున్న ఎన్నికల్లో బరిలోకి దించుతోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో గట్టిపట్టున్న కేఏ నాయుడు తన అన్న కొడుకు శ్రీనివాసరావుకి సహకరిస్తాడా లేక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడా అన్నదీసర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కే ఏ నాయుడు తీసుకునే నిర్ణయంపై టీడీపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఇక్కడ వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నర్సయ్య పోటీ చేయటంతో ఆయనపై టీడీపీ నుండి కొండపల్లి శ్రీనివాసరావు పోటి చేయడం ఆసక్తిగా మారింది.

ఇక, మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలో సైతం అసమ్మతి సెగలు పెల్లుబీకాయి. నెల్లిమర్లలో ఇప్పటివరకు టీడీపీ ఇంచార్జిగా కర్రోతు బంగారు రాజు కొనసాగుతున్నారు. అధిష్టానం పిలుపుతో అనేక పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో టీడీపీ రెండుసార్లు మినహా ఎప్పుడూ ఓడిపోయిందీ లేదు. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇక్కడి నుండి జనసేన తరుపున పోటీ చేసిన లోకం నాగ మాధవికి కేవలం ఎనిమిది వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతే కాకుండా తూర్పు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గం. అయితే అనుహ్యంగా జనసేన పార్టీ అభ్యర్థిగా నాగ మాధవి పేరు తెరపైకి వచ్చింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన లోకం నాగ మాధవికి టికెట్ ఇవ్వటంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇంచార్జి బంగార్రాజు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా ప్రస్తుత తెలుగుదేశం – జనసేన కూటమి టికెట్ల ప్రకటన టీడీపీలో మంటలు రేపిందనే చెప్పాలి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…