Tirupati Laddu: సిట్ దర్యాప్తా? సీబీఐ విచారణా? జ్యుడీషియల్ ఎక్వైరీనా? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
Tirupati Laddu: ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇవాళ సుప్రీంలో మరోసారి విచారణ జరగనుండడంతో ఎలాంటి తీర్పు ఇస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తా?.. సీబీఐ విచారణా?.. లేక జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తుందా?.. అసలు.. లడ్డూ కల్తీ వివాదంపై ఎవరి డిమాండ్ ఏంటి?.. ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతోంది?
Tirupati Laddu: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు ప్రకటనతో ప్రారంభమై.. అన్ని పార్టీల వ్యాఖ్యలు, ఆందోళనలతో లడ్డూ కల్తీ అంశం రాజకీయ రంగు పులుముకుని కాక పుట్టించింది. ఒక దశలో సీఎం, మాజీ సీఎంల మధ్య పొలిటికల్ ఫైట్ జరిగింది. సరిగ్గా ఇలాంటి సమయంలో లడ్డూ కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం.. ఆపై కీలక వ్యాఖ్యలు చేయడంతో లడ్డూ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మూడు రోజుల క్రితం విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. అత్యున్నత ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి ప్రకటనలతో భక్తుల మనోభావాలకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ జరిగిందనేందుకు ఆధారాలు ఏమున్నాయని క్వశ్చన్ చేసింది.
అటు.. టీటీడీ తరపున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ్ లూధ్రా.. కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్టు భావిస్తున్నామని.. లడ్డూ నాణ్యతపై భక్తులు కూడా ఫిర్యాదు చేశారని సుప్రీంకోర్టుకు తెలిపారు. కానీ.. కల్తీ నెయ్యిని లడ్డూలో వినియోగించినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, TTD వాదనపై స్పష్టత కావాలని కోరింది. ఈ క్రమంలోనే.. ఇరు వర్గాల వాదనలు విన్నాక.. విచారణను నేటికి వాయిదా వేసింది. దర్యాప్తు సిట్‌తో కొనసాగాలా లేక.. స్వతంత్ర సంస్థతో చేయించాలా అనేదానిపై సొలిసిటర్ జనరల్‌తో మాట్లాడి నిర్ణయిస్తామంది సుప్రీంకోర్టు. దాంతో.. అధికార, ప్రతిపక్షాలతోపాటు అందరి చూపు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపై పడింది. సిట్ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?.. సీబీఐ విచారణకు మొగ్గు చూపుతుందా?.. లేక.. జ్యుడీషియల్ ఎక్వైరీకి ఆదేశిస్తుందా?.. అనేది సస్పెన్స్‌గా మారుతోంది.
వాస్తవానికి.. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక విచారణకు అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. సీబీఐ చేత విచారణ చేయించాలన్నారు వైసీపీ, కాంగ్రెస్ నేతలు. అయితే.. అనేక పరిణామాల నేపథ్యంలో.. సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సిట్ విచారణను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనప్పటికీ.. ఇవాళ్టి తీర్పును బట్టి ముందుకెళ్లాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. మొత్తంగా… దేశవ్యాప్తంగా దుమారం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..