Andhra Pradesh: పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?

ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్‌.. వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్‌రాజ్‌ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.

Andhra Pradesh: పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?
Pawan Kalyan
Follow us
TV9 Telugu

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 03, 2024 | 9:00 AM

వారాహి ఊరేగింపులు, వారాహి సభలు కాదు.. వారాహి డిక్లరేషన్.. ఇదీ ఇప్పుడు పవన్ సెంట్రిక్‌గా ట్రెండౌతున్న మేజర్ టాపిక్. నిన్నటిదాకా దేశమంతా మారుమోగిన లడ్డూ ప్రసాద వివాదాన్ని సైతం మర్చిపోయేలా చేసిన వారాహి డిక్లరేషన్‌లో ఏముందసలు..? దీని ద్వారా హైందవ సమాజానికి పవన్ ఇవ్వబోయే సందేశం ఏంటి..? వారాహి డిక్లరేషన్‌తో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చెయ్యబోతున్నారా..? ఇన్ని సందేహాలకు అక్టోబర్‌ 3 గురువారం తిరుపతిలో జరిగే వారాహి సభలోనే సమాధానం.

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి.. డిక్లరేషన్ పత్రాలపై ఇద్దరు కూతుర్లతో కలిసి సంతకాలు చేశారు పవన్‌కల్యాణ్. ఒక డిక్లరేషన్‌కి అలా ముగింపునిచ్చారు. కానీ.. మరొక డిక్లరేషన్‌ మాత్రం సస్పెన్స్‌లోనే ఉంది. అదే వారాహి డిక్లరేషన్. ఎర్రటి కవర్‌పేజ్‌పై ధర్మో రక్షతి రక్షితః అనే పెద్దక్షరాలతో కూడిన వారాహి డిక్లరేషన్.. పవన్ చేతిలో మిలమిలా మెరుస్తూనే ఉంది. సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడుకోడానికే ఒక రోడ్‌మ్యాప్ రాసుకున్నానని, వారాహి డిక్లరేషన్‌ ద్వారా దాన్ని చెప్పబోతున్నానని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఆవిధంగా వారాహి డిక్లరేషన్‌పై ఆసక్తిని పెంచేశారు పవన్.

తిరుమలేశుడ్ని దర్శనం చేసుకుని.. శ్రీవారి సన్నిధిలో ధ్వజస్తంభం దగ్గర డిక్లరేషన్ పుస్తకాన్నుంచి.. ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు పవన్. నాలుగు మాడవీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా పవన్ చేతిలో ఎర్రటి డిక్లరేషన్ పుస్తకం మీదే మీడియా అంతా ఫోకస్ చేసింది. గురువారం తిరుపతిలో జరిగే వారాహి సభలో డిక్లరేషన్ ఫైల్‌ని ఓపెన్ చేసి.. అందులో రాసున్న తీర్మానాల్ని వెల్లడించే ఛాన్సుంది. ఇంతకీ పవన్ రాసుకున్న డిక్లరేషన్‌లో ఏముంది..? తెలుగు రాష్ట్రాల నుంచి హైందవానికి ఛాంపియన్‌గా ఎక్స్‌పోజ్ అవుతున్న పవన్.. సనాతన డిక్లరేషన్ ద్వారా చెప్పదల్చుకున్నదేంటి?

ఇవి కూడా చదవండి

శ్రీవారి పాదాల చెంతకు సనాతన ధర్మ పరిరక్షకుడు అంటూ జనసేన సోషల్ మీడియాలో పవన్‌కల్యాణ్‌కి విస్తృతంగా ఎలివేషన్ ఇచ్చుకున్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనే పేరుతో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కూడా ఉంది. నేషనల్ మీడియాలో సైతం పవన్ రిలీజ్ చెయ్యబోయే సనాతన డిక్లరేషన్‌ కోసం వెయిటింగ్‌లో ఉంది. హిందూయిజాన్ని టార్గెట్ చెయ్యడం అందరికీ అలవాటుగా మారిపోయిందని, దీనికి చెక్ పెట్టడమే తన ధ్యేయమని చెబుతూ వస్తున్నారు పవన్‌కల్యాణ్. తిరుమలలో ఇచ్చిన తాజా ఇంటర్వ్యూల్లో కూడా అదే చెప్పారు.

ఇవాళ సాయంత్రం తిరుపతిలో జరిగే వారాహి సభలో హైలైట్ కాబోతోంది వారాహి డిక్లరేషన్‌. డిక్లరేషన్‌లో అంశాలను మాత్రం ఇప్పటివరకూ లీక్ చెయ్యలేదు. ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వొద్దని పార్టీ నేతల్ని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్‌.. వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్‌రాజ్‌ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.

సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని గతంలోనే మాటిచ్చారు పవన్. ఇప్పటికే ఉదయనిధి లాంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలతో సనాతన ధర్మం వివాదాస్పదమైంది. తాజాగా పవన్‌కల్యాణ్ సనాతన ధర్మానికి ఆధునిక నిర్వచనం ఏదైనా ఇస్తారా? సనాతన పరిరక్షణ కోసం ఎటువంటి గైడ్‌లైన్స్ ఇస్తారు..? వారాహి డిక్లరేషన్‌లో సీక్రెట్లేంటో కనీసం సీఎం చంద్రబాబుకైనా తెలుసా..? అని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. లడ్డూ కల్తీ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. కానీ.. దానికి మించి ఆసక్తిని పెంచుతోంది పవన్ వారాహి సభ.. ఆయన చేతిలో మెరిసే వారాహి డిక్లరేషన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..