Success Story: కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ.. పది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆదర్శ ఉపాధ్యాయురాలు..

Annamaya District News: అంగవైకల్యాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి.. కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ గమ్యం వైపు అడుగులేసింది.. తన జీవితాన్ని చిమ్మ చీకటి చుట్టేసినా పది మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ తన ఉపాధ్యాయ బాధ్యతను నెరవేరుస్తూ అందులోనే ఆనందం ఉందని మురిసిపోతోంది. తను నమ్ముకున్న వృత్తికి న్యాయం చేస్తూ.. భావి భారత విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఆమె దీక్ష ముందు అన్నీ..

Success Story: కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ.. పది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆదర్శ ఉపాధ్యాయురాలు..
Sudhamani
Follow us
Sudhir Chappidi

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 28, 2023 | 10:37 PM

అన్నమయ్య జిల్లా, జూలై 28: తమలోని లోపాన్ని అధిగమించేందుకు అనన్యసామాన్యమై దీక్షతో ముందుకు దూసుకుపోతున్నారు. పెద్దల మాటలు ఎవరి విషయంలో ఏమో కానీ.. మన తెలుగు బిడ్డ విషయంలో మాత్రం నూటికి నూరుపాల్లు నిజమనే చెప్పాలి. ఆమె ఆశయానికి అడ్డంకి కాలేదు. ఆమె దృఢ సంకల్పం ముందు ద్రుష్టి లోపం తలవంచింది. అంగవైకల్యాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి.. కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ గమ్యం వైపు అడుగులేసింది.. తన జీవితాన్ని చిమ్మ చీకటి చుట్టేసినా పది మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ తన ఉపాధ్యాయ బాధ్యతను నెరవేరుస్తూ అందులోనే ఆనందం ఉందని మురిసిపోతోంది. తను నమ్ముకున్న వృత్తికి న్యాయం చేస్తూ.. భావి భారత విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెస్తున్న ఈమె జీవితం నేటి ఉపాధ్యాయులకు స్పూర్తి దాయకం.

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం హత్యరాల గ్రామంలో జన్మించిన సుధామణి అందరి పిల్లల్లాగా ఈమె బాల్యం కూడా ఆటపాటలతో సాగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాల లోనే ఐదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేసింది. చదువులో రాణిస్తూ తరగతిలో అందరికంటే ముందుగా నిలిచి తన ప్రతిభను చాటేది. అప్పటివరకు సజావుగా సాగిన తన జీవితంలో ఉన్నట్టుండి విషాదఛాయలు అలుముకున్నాయి. క్రమేపీ కారు చీకట్లు ఆమెను కమ్ముకున్నాయి. తన కనుచూపు కోల్పోయింది. తనకు కళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులకు తెలిపింది. కన్నబిడ్డ కంటి చూపు కోల్పోవడం చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందారు.

మధురై కంటి ఆసుపత్రి మొదలు ఎన్నో వైద్యశాలల్లో ప్రఖ్యాత వైద్యులకు చూపించి వైద్యం చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. తల్లిదండ్రులు మేనరికం వివాహం చేసుకోవడం వల్ల కంటి నరాలు దెబ్బ తిన్నాయని వైద్యులు తెలిపారు. దీనికి ఏ వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. సుధామణి తో పాటు కుటుంబం మొత్తం తీరని ఆవేదనకు గురైంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు చదువు మానేయమని సూచించారు. చదవలేని పరిస్థితి… చుట్టూ చిమ్మచీకట్లతో. భవిష్యత్ అంధకారమైంది. చిన్నప్పటినుంచి ఆమెకు ఉపాధ్యాయురాలు కావాలన్న కోరిక ఉన్నా చదువు కొనసాగించలేని పరిస్థితులు ఆమెను చుట్టుముట్టాయి.

ఇవి కూడా చదవండి

విద్యను అభ్యసించి..

ఈ పరిస్థితుల్లోను ఆమె ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగింది. అంకుటిత దీక్షతో తన చదువు కొనసాగించింది. ఆరు, ఏడవ తరగతులు స్థానిక హై స్కూల్ లోనే చదివింది. ఏమీ అర్థం కాకపోయినా పాఠశాలకు వెళ్లి వస్తోంది. ఈమె పట్టుదల చూసి ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. కడపలోని అంధుల పాఠశాలలో ఎనిమిదో తరగతి లో చేర్పించారు. అంతే ఆమె ఇక తిరిగి చూడలేదు.. చదువుల్లో రాణించింది. ఇంటర్ పూర్తి చేసి డీఎస్సీ లో సీటు సాధించింది. పట్టుదలతో చదివి ఉపాధ్యాయ విద్య పూర్తిచేసి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సాధించింది.

ప్రస్తుతం ఆమె రాజంపేట పట్టణంలోని రాంనగర్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సరైన సమయానికి పాఠశాలకు రావడం క్రమంతప్పకుండా విధులకు హాజరవడం ఈమె నైజం… తన తండ్రిని వెంటబెట్టుకుని విధులకు హాజరు అవడమే కాదు.. బోధించడంలో ఇతర ఉపాధ్యాయులతో పోటీ పడటం ఈమె ప్రత్యేకత. తన వైకల్యం వల్ల విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని ఒక సహాయకురాలి ని కూడా ఏర్పాటు చేసుకుంది. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ఎందరో భావి భారత పౌరులను తయారుచేస్తుంది.ఇలా కళ్ళు లేకున్నా తన కలలను సాకారం చేసుకున్న సుధామణి జీవితం ఇతరులకు ఆదర్శం కావాలని ఆశిద్దాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం