Andhra Pradesh: అసలేం జరుగుతోంది.. అక్కడి విద్యార్థినులకు ఏమవుతోంది.. కాకినాడ జిల్లాలో కలకలం..
అదేంటో తెలీదు.. ఏం రోగమో అర్ధం కాదు.. కానీ అక్కడి విద్యార్ధులు వింతగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. కళ్లు తిరిగి పడిపోవడం.. ఏదో పట్టి పీడించినట్టు.. ప్రవర్తించడం.. వంటి వాటితో హడలెత్తించేశారు.

అదేంటో తెలీదు.. ఏం రోగమో అర్ధం కాదు.. కానీ అక్కడి విద్యార్ధులు వింతగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. కళ్లు తిరిగి పడిపోవడం.. ఏదో పట్టి పీడించినట్టు.. ప్రవర్తించడం.. వంటి వాటితో హడలెత్తించేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా.. దాచి ఉంచారా టీచర్లు. ఇంతకీ వీళ్లకొచ్చిన ఆ కష్టం పేరేంటి? దీనంతటికీ కారణమేంటి? అనే విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటన కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. యు. కొత్తపల్లి, ఉప్పాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసిందీ వింత ఘటన. స్కూల్ కి వచ్చిన విద్యార్ధులకు ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడం, శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న వైనం.. కనిపించింది.. వారం రోజులుగా రోజుకు ఇద్దరు ముగ్గురు పరిస్థితి ఇదే కావడం ఆశ్చర్యకరం.
శనివారం ఉదయం స్కూలుకొచ్చిన తొమ్మిది, పదో తరగతి విద్యార్ధినులు ఒకరి తర్వాత ఐదుగురు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. మరొక గదిలోకి తీసుకెళ్లి పేపర్ ముక్కలను వాసన చూపించడంతో.. వారు సాధారణ స్థితికి వచ్చారంటున్నారు టీచర్లు. లంచ్ విరామానికి ముందే జరిగిందీ ఘటన. విషయం బయటకు పొక్కనివ్వలేదా టీచర్లు. కేవలం పేరెంట్స్ కి మాత్రమే సమాచారమిచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించినా సమస్యకు కారణమేంటో తెలీక పోవడం మరో విడ్డూరం.
ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ పిల్లలకు ఏమైంది? ఎందుకని వీరిలా సొమ్మసిల్లి పడిపోతున్నారు? కారణాలు ఏమై ఉండొచ్చు? ఇదే ప్రస్తుతం ఈ స్కూల్లోని ఇతర పిల్లలు, వారి తల్లిదండ్రులను తొలచేస్తోన్న ప్రశ్న. ఇక్కడ మరో విచిత్రమేంటంటే.. కొన్నాళ్ల నుంచీ ఇలా జరుగుతున్నా.. విషయం బయటకు రాకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




ప్రస్తుతం దీపావళి సెలవులు కావడంతో.. ఏం జరిగిందని అడుగుదామంటే స్కూలు లేదు. టీచర్లూ అందుబాటులో లేరు. దీంతో ఏం చేయాలో పాలు పోని స్థితిలో పడ్డారా తల్లిదండ్రులు. మరి చూడాలి. ఇది మానసికమైన సమస్యా? లేక శారీరకమైనదా? తెలియాల్సి ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..