Weekend Hour: మూడు రాజధానులు వర్సెస్‌ మూడు పెళ్లిళ్ల వివాదం.. ఏపీలో రచ్చ లేపుతున్న టాపిక్

Weekend Hour: మూడు రాజధానులు వర్సెస్‌ మూడు పెళ్లిళ్ల వివాదం.. ఏపీలో రచ్చ లేపుతున్న టాపిక్

Ram Naramaneni

|

Updated on: Oct 22, 2022 | 7:09 PM

మూడు రాజధానులు వర్సెస్‌ మూడు పెళ్లిళ్ల వివాదం ఇప్పుడు మహిళా కమిషన్‌ వద్దకు చేరింది. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం నేపథ్యంలో వైసీపీ నేతలు టార్గెట్ చేయడంపై స్పందించిన పవన్ కళ్యాణ్... కావాలంటే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళలను అవమానించడంతో పాటు యువతకు ఇస్తున్న సందేశం ఏంటని ప్రశ్నిస్తోంది కమిషన్. క్షమాపణలు చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్‌.

మూడు పెళ్లిళ్లపై ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌ అయింది ఏపీ మహిళా కమిషన్‌. పవన్‌ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని నోటీసులు జారీ చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చన్న భావనలో పవన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, అవి తీవ్రంగా బాధించాయని పేర్కొంది మహిళా కమిషన్‌. మహిళలకు పవన్ కళ్యాణ్ సంజాయిషీ ఇవ్వాలని, సినిమా హీరోగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మూడు పెళ్లిళ్లపై ఆయన మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయని పేర్కొంది కమిషన్‌. చేసిన పొరపాటును గుర్తించి వెంటనే పవన్‌ క్షమాపణ చెప్పాలన్నారు వాసిరెడ్డి పద్మ. లేదంటే ఇదో మహిళా ఉద్యమంగా మారే అవకాశం ఉంటుందన్నారు. అటు పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ విమర్శలు డోసు కూడా పెంచింది. చిన్ని పిల్లలు కూడా సిగ్గుపడేలా పవన్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి. మూడు రాజధానులు వైసీపీ విధానం అయితే… జనసేనది మూడు పెళ్లిళ్లు అంటూ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ దీనిని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటోంది. మరి ఈ అంశంలో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

Published on: Oct 22, 2022 07:09 PM