Srikalahasti Master Plan: శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్ అమలుకు రంగం సిద్ధం.. రూ. 300 కోట్ల ఖర్చుతో 3 దశల్లో అమలు..
Srikalahasti Master Plan: శ్రీకాళహస్తిని చుట్టుముట్టిన కష్టాలు తొలగిపోనున్నాయి. ఆలయ మాస్టర్ ప్లాన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. త్వరలో అధికారులు 300 కోట్ల రూపాయల ఖర్చుతో మూడు దశల్లో పనులు ప్రారంభించనున్నారు. శివుడు.. శ్రీకాళహస్తీశ్వరుడిగా అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా కొలువైన కాళహస్తి ఆలయం త్వరలోనే సరికొత్త హంగులు, అందాలు సంతరించుకుని, సకల సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి రానుంది.
Srikalahasti Master Plan: శివుడు.. శ్రీకాళహస్తీశ్వరుడిగా అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా కొలువైన కాళహస్తి ఆలయం త్వరలోనే సరికొత్త హంగులు, అందాలు సంతరించుకుని, సకల సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి రానుంది. ఎన్నాళ్లో వేచిన సమయం దగ్గర పడింది. ఎట్టకేలకు శ్రీకాళహస్తి ఆలయంలో మాస్టర్ ప్లాన్ అమలుకు రంగం సిద్ధం అయింది. మూడు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పాలక మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసిన ద్రోణ కన్సల్టెన్సీ సంస్థతో భేటీ అయ్యారు. మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసే విధంగా డిజైన్లను పరిశీలించి ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పాలకమండలి పంపింది. మొదటి దశలో రెండు భారీ భవన నిర్మాణాలను చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు.
గాలిగోపురం నుంచి జల వినాయకుడి ఆలయం వరకు రెండు అంతస్తుల భవనం, అక్కడి నుంచి నాలుగవ నెంబర్ గేటు వరకు ఆలయం చుట్టూ భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయల ఖర్చుతో మూడేళ్ల క్రితమే దేవస్థానం భూసేకరణ పూర్తి చేసింది. మరో 10 రోజుల్లో మొదటి దశ మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభించేందుకు దేవస్థానం సిద్ధమైంది. మొదటి దశలో క్యూ కాంప్లెక్సులు, సర్పదోష మండపాలు, ధూర్జటి కళా మండప నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోబోతున్నారు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు.
ఇక రెండో దశలో స్వర్ణ ముఖి ప్రక్షాళన, స్నాన ఘట్టాల నిర్మాణం చేపడతారు. ఆ తర్వాత మూడోదశలో భరద్వాజ తీర్థం, అతిధి గృహాల నిర్మాణ పనులు దేవస్థానం చేపట్టనుందని చెబుతున్నారు. మొత్తం 300 కోట్ల రూపాయల ఖర్చుతో మూడేళ్లలో మాస్టర్ ప్లాన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భూ సేకరణకు పూర్తయినందున ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులు చకచకా జరిగిపోతాయని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..