శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీలో విద్యార్ధి సూసైడ్.. ఏం జరిగిందో?
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లోని ఐఐఐటిలో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈరోజు ఉదయం హాస్టల్ రూంలో సృజన్ అనే విద్యార్ధి ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ట్రిబుల్ ఐటీ లో మూడో సంవత్సరం EEE చదువుతున్న గుంటూరు కి చెందిన సృజన్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎచ్చెర్ల పోలీసులు..

శ్రీకాకుళం, నవంబర్ 12: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లోని ఐఐఐటిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రత్తిపాటి సృజన్ (20) అనే విద్యార్ది ఈఈఈ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ బుధవారం (నవంబర్ 12) ఉదయం హాస్టల్ రూంలో సృజన్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. గమనించిన తోటి విద్యార్ధులకు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు హాస్టల్ గది తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అయితే అప్పటికే సృజన్ మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి సృజన్‌ను గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు.
ట్రిపుల్ ఐటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం సృజన్ మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎచ్చెర్ల పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా సృజన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




