AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nallamala: అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వజ్రాల వేట

Nallamala: అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వజ్రాల వేట

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 5:45 PM

Share

నల్లమల అడవిలోని రాళ్లవాగు ఇప్పుడు 'వజ్రాల వాగు'గా ప్రచారంలో ఉంది. ప్రాచీన ఆలయ కథలు, సోషల్ మీడియా ప్రభావంతో వందలాది మంది వజ్రాల ఆశతో కర్నూలు జిల్లాకు తరలివస్తున్నారు. ఇప్పటివరకు వజ్రాలు దొరకనప్పటికీ, ఈ ప్రాంతంలో వ్యాపారం పుంజుకుంది. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వజ్రాల వేట వెనుక వాస్తవాలను పరిశీలిద్దాం.

నల్లమల అడవిలో పారే రాళ్లవాగు ఇప్పుడు వజ్రాల వాగుగా ప్రచారం పొందుతోంది. వజ్రాల ఆశతో పేదలు, కూలీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రాల కోసం వాగులో తవ్వకాలు, శోధనలు సాగుతుండటంతో ఈ విషయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో స్వామి, అమ్మవార్ల కళ్యాణం సందర్భంగా వజ్రాలతో తలంబ్రాలు పోశారనే నమ్మకం స్థానికుల్లో ఉంది. ఆలయం క్రింద భాగంలో ప్రవహించే రాళ్లవాగును ప్రజలు ఇప్పుడు వజ్రాల వాగుగా పిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ వాగులో వజ్రాలు లభ్యమవుతున్నాయనే ప్రచారం ఉంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాగులో వజ్రాల కోసం వెతికినా, ఇప్పటివరకు ఎవరికి ఏ వజ్రం దొరకలేదని చెబుతున్నారు. కేవలం సుద్దరాళ్లు మాత్రమే లభిస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ప్రభావంతో వజ్రాల వాగు పేరు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో, వందలాది మంది ఆశావహులు అక్కడికి తరలివస్తున్నారు. గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. రైల్వే సౌకర్యం కారణంగా గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాల నుంచి కూడా పేద కూలీలు ఈ వజ్రాల వేటలో పాల్గొంటున్నారు. వజ్రాల కోసం వచ్చే వారు జల్లెడలు, గడ్డపారలు వంటి పరికరాలు తెచ్చుకుని వాగులో తవ్వకాలు చేస్తున్నారు. వజ్రం దొరికిందని అనిపిస్తే… దానిని అక్కడే కొందరు వ్యక్తులు పరికరాలతో పరీక్షిస్తున్నారు. ఒకప్పుడు ఒక్క రాయిని పరీక్షించేందుకు పది రూపాయలు తీసుకుంటే, ఇప్పుడు ఆ రేటు ముప్పై రూపాయలకు పెరిగింది. ఇక వజ్రాల వేటతో పాటు వాగు సమీపంలో కొత్తగా హోటళ్లు, కూల్‌డ్రింక్‌ షాపులు, ఐస్‌బండ్లు కూడా వెలిసి ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. వజ్రాలు దొరకకపోయినా, వ్యాపారం మాత్రం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోంది. ఫారెస్ట్‌ పరిధిలో ఉండే ఈ ప్రాంతంలో వందలాది మంది రోజూ వజ్రాల కోసం వెదుకుతుండగా, అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తలు తీసుకుని, వజ్రాల వాగు వైపు జనసంచారాన్ని నియంత్రిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా

మంగళాద్రి ముఖ మండపానికి మహర్దశ

Organ Donation: మరణం తర్వాత అవయవదానం

ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు

తాగకపోతే దాహం, తాగితే రోగం 143 కృష్ణా గ్రామాల వారి ఆవేదన