Pulasa Fish: యానాంలో పులస చేప కోసం ఎగబడ్డ జనం.. ఖరీదు ఎంతో తెలుసా?
చేప ప్రియులు జీవితంలో ఒకసారైనా రుచి చూడాలని కోరుకునే పులస చేపల రాక మొదలైంది. యానాం, ఉభయ గోదావరి జిల్లాలో ఈ సీజన్‌లో మార్కెట్‌లోకి పులస చేపల రాక ప్రారంభమైంది.
Pulasa Fish: పులస చేప రుచికి ముందు మిగతా చేపల రుచి దిగదుడుపే. జీవితంలో ఒకసారైనా పులస చేపలను రుచి చూడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటున్నారు. ఎంతో రుచికరమైన పులస చేపలు కాస్త ఎక్కువ ధర పలికినా… వాటిని కొనేందుకు పోటీపడుతుంటారు చేప ప్రియులు. అందుకే వీటి ధర ఎప్పుడూ ఆకాశంలో ఉంటుంది. గోదావరి నదిలో మాత్రమే లభించే పులస చేపలు ఈ సీజన్‌లో మార్కెట్‌లోకి రావడం ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదనీరు సముద్రంలోకి వెళ్లడం మొదలవుతుంది. ఈ క్రమంలో మట్టితో కూడిన నీటి రుచికి పులస చేపలు సముద్రంలో నుంచి సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వస్తున్నాయి. వరద నీటికి ఎదురీది వెళ్లడం వల్లే వీటికి ఇంత రుచి వస్తుందని కోనసీమ వాసులు చెబుతారు. ఇవి సంతానోత్పత్తి కోసం వెళ్తూ మార్గమధ్యంలో జాలర్లకు చిక్కుతుంటాయి.
నిన్న యానాంలో గౌతమి గోదావరిలో ఓ పులస చేప జాలర్లకు చిక్కింది. ఈ చేపను కొనేందుకు స్థానికులు పోటీపడ్డారు. వేలంపాటలో ఇది రూ.6 వేల ధర పలికింది. ఈ చేప కిలోకు పైగా బరువు ఉన్నట్టు చేపను విక్రయించిన మహిళ పొన్నమండ రత్నం తెలిపింది. ఒక్క చేప రూ.6 వేలకు అమ్ముడుపోవడం పట్ల సంతోషం వ్యక్తంచేసింది. వర్షాకాల సీజన్ మొదలై వరదలు వస్తుండటంతో ఇక మరిన్ని పులస చేపలు పట్టుబడుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
– సత్య, TV9 తెలుగు, రాజమండ్రి (తూర్పు గోదావరి జిల్లా)
Also Read..
Viral Video: పాము, ముంగిసల మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారంటే..?