Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం… పోటెత్తిన వరద.. వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు
హైదరాబాద్ నగరం మరోసారి నీట మునిగింది.. మూసీ ఉప్పొంగింది. రెండు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
హైదరాబాద్ నగరం మరోసారి నీట మునిగింది.. మూసీ ఉప్పొంగింది. రెండు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సరూర్‌నగర్, ఉప్పల్, హయత్‌నగర్, నాగోల్, ఓల్డ్‌సిటీ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, సామాగ్రి తడిసి ముద్దయ్యాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరదల్లో చిక్కుకున్నారు. హస్తినాపురం డివిజన్ సాగర్ ఎంక్లేవ్ లో పర్యటిస్తుండగా ఆయన కారు వరదల్లో చిక్కుకు పోయింది. ఎంత ప్రయత్నించినా కారు ముందుకు కదలలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తో పాటు ఎమ్మెల్యే కూడా కారును తోశారు. చాలా సేపటి తర్వాత ఎలాగో వరద నుంచి బయట పడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
హైదరాబాద్‌లోని నాచారం, రాఘవేంద్రనగర్ కాలనీలను వరద నీరు ముంచెత్తింది. దీంతో కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఇళ్ల నుంచి జనం బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. భారీ వర్షానికి హయత్‌నగర్‌లోని ఆర్టీసీ డిపో నీట మునిగింది. వాహనాలు బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. పీర్జాదీగూడలోని ప్రగతినగర్‌లో గత ఏడాది వరద నీరు ముంచెత్తింది. ఇప్పుడు కూడా మళ్లీ నీరు ముంచెత్తింది. దీంతో కాలనీని ఖాళీ చేస్తున్నారు స్థానికులు. మల్కాజ్‌గిరి, మౌలాలి ప్రాంతాలను కూడా వరద నీరు ముంచెత్తింది. దీంతో స్థానికులు వణికిపోతున్నారు.
భారీ వర్షానికి నాగోల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. కాలనీలు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నాగోల్‌లోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. వందలాది కుటుంబాలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. భారీ వర్షానికి హైదరాబాద్‌లోని మూసీ ఉప్పొంగింది. మూసారాం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో కొన్ని గంటల పాటు రాకపోకలను అంతరాయం ఏర్పడింది. మూవీ పరివాహన ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నగరంలోని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ కాలనీల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరింది.
వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయింది. అటు పాత బస్తీలో కూడా లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్, ప్రశాంత్‌నగర్, మిథిలానగర్, బడంగ్‌పేట్ తో పాటు పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నాచారంలోని పలు కాలనీలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో నాచారం, హబ్సీగూడ రహదారిలో భారీ వృక్షం నేలకూలింది. దీంతో రాకపోలకు అంతరాయం ఏర్పడింది. రామంతపూర్ లోని భవానీనగర్, శాంతినగర్, భరత్‌నగర్ కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. దీంతో కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉప్పల్, అబ్దుల్లాపూర్‌పెట్‌లో అత్యధికంగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో 19, పెద్ద అంబర్‌పేటలో 18, సరూర్‌నగర్, రామంతపూర్‌లో 17 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. హబ్సీగూడలో 16, నాగోల్‌లో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read: హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. ఆ జిల్లాలలో కూడా.. రానున్న గంటల్లో భారీ వర్ష సూచన