AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: మాడు పగిలే మండుటెండలు.. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడితో పాటు వడగాలులు, ఉక్కబోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏపీలో రానున్న రెండ్రోజుల పాటు వడగాలులు బలంగా వీచే అవకాశముంది. ఇక తెలంగాణలో రాబోయే 10 రోజులు ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Weather Report: మాడు పగిలే మండుటెండలు.. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
Summer
Venkatrao Lella
|

Updated on: Apr 13, 2026 | 6:54 AM

Share

ఎండలు, వడగాల్పులపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక మంగవారం ఏకంగా 53 మండలాల్లో తీవ్ర స్థాయిలో వడగాలులు వీస్తాయని, ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు రాకపోవడం మంచిదని వాతావరణశాఖ సూచనలు చేసింది.

వచ్చే రెండు రోజులు జాగ్రత్త

రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. సోమవారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ఇక మంగళవారం 53 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 57 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు. రానున్న రెండు రోజుల వాతావరణం చూస్తే.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఆదివారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నంద్యాల రూరల్ మండలంలో 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఏప్రిల్‌లోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోగా.. మే నెలలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

22 వరకు మండుటెండలు

ఇక తెలంగాణలో ఈ నెల 22వ తేదీ వరకు భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. బయటకు వెళితే తలకు గ్యాప్, గొడుగు లాంటివి వాడాలని తెలిపింది. ఇక వాటర్, జ్యూస్‌లు లాంటి ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. ఇక హైదరాబాద్‌లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండ ప్రభావం క్రమంలో మధ్యాహ్న వేళల్లో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Follow Us