AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Desam: ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టిడిపి సీనియర్ నేత.. ఎందుకో తెలుసా..

ఆయన పార్టీలో నెంబర్ టూ.. పార్టీ అధినేతకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు. ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన ఎవరంటే అశోక్ గజపతిరాజు.

Telugu Desam: ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టిడిపి సీనియర్ నేత.. ఎందుకో తెలుసా..
Ashok Gajapati Raju
Gamidi Koteswara Rao
| Edited By: Srikar T|

Updated on: Apr 01, 2024 | 11:29 AM

Share

ఆయన పార్టీలో నెంబర్ టూ.. పార్టీ అధినేతకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు. ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన ఎవరంటే అశోక్ గజపతిరాజు. రాజకీయాల్లో ఈయన అంటే తెలియని వారుండరు. విజయనగర సంస్థానాధీశులైన గజపతిరాజుల వారసులే అశోక్ గజపతిరాజు. ఈయన తరువాత తండ్రి డాక్టర్ పి వి జి రాజు, సోదరుడు ఆనంద గజపతిరాజులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. వారిలానే అశోక్ గజపతిరాజు కూడా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన అశోక్ గజపతిరాజు మొత్తం పది సార్లు ఎన్నికల బరిలో దిగగా 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు మినహా వరుసగా అన్నీ ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడిగు పెట్టారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుతో సమకాలిక రాజకీయాలు చేసిన నేత.

2014లో తొలిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా పనిచేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక వినూత్న సంస్కరణలతో బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూశారు. అయితే ఆ ఎన్నికల సమయంలోనే అనారోగ్యంతో ఇబ్బంది పడిన అశోక్ గజపతిరాజు ఎన్నికల తరువాత మేజర్ సర్జరీ చేయించుకున్నారు. అప్పటినుంచి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతునప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొనేవారు. అయితే ఆ క్రమంలోనే వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు లేని విధంగా అనేక సమస్యలు ఎదుర్కున్నారు. అప్పటికే మాన్సాస్ ఛైర్మన్‎గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత గజపతి రాజును మాన్సాస్ ఛైర్మన్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో తిరిగి మాన్సాస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

అలా అనుకోని పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో అనేక కేసులు కూడా అశోక్ గజపతిరాజు పై నమోదయ్యాయి. ఎప్పుడు లేని విధంగా 75 సంవత్సరాల వయసులో అశోక్ గజపతిరాజు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా అనారోగ్య సమస్యలతో పాటు మాన్సాస్ ట్రస్ట్ వివాదాలతో అనేక సమస్యలు వెంటాడాయి.. ఈ క్రమంలోనే ప్రస్తుతం వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఎంపిగా బరిలోకి దిగుతారని అంతా అనుకున్నారు. అయితే విజయనగరం నుండి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన కుమార్తె అదితి గజపతి రాజుకు టిక్కెట్ కేటాయించింది అధిష్టానం. ఎంపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరు ఖరారు చేసింది. దీంతో అశోక్ గజపతిరాజు పోటీపై అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను అనారోగ్య కారణాలతోనే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. భవిష్యత్తులో ఒక సీనియర్‎గా పార్టీ ఎప్పుడైనా, ఏమైనా సలహాలు అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తానని అన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నానన్న అశోక్ ప్రకటనతో ఆయన అభిమానుల్లో మాత్రం ఒకింత నిరాశ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..