Andhra Pradesh: ఇసుక తవ్వకాలు, రవాణాపై సెల్ఫీ చాలెంజ్- జేసీ ప్రభాకర్‌రెడ్డి
తనపై ఎలాంటి కేసులు పెడతారో పెట్టుకోమన్నారు. నాలుగేళ్ల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా.. ఏ అధికారి పట్టించుకోవడం లేదన్నారు. అక్రమంగా ఇసుక తోలకూడదని కోర్టు నుండి ఆర్డర్ కూడా తెచ్చుకున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేను ప్రజలు పంచె విప్పి కొట్టడం..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రస్తుతం ఇసుక చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా పెన్నా నది నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. పర్మిషన్ తీసుకుంది కొంత.. దోచింది కొండంత అంటూ కొద్దిరోజులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే.. పెన్నా నది ఇసుక రీచ్ వద్దకు వెళ్లి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన కూడా చేశారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గం వచ్చినప్పుడు కూడా పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు, రవాణాపై సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి దూకుడు పెంచబోతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
పెన్నా నదిలో పర్మిషన్ లేకుండా ఇసుక రవాణా చేస్తే.. వచ్చే సోమవారం నుంచి అక్కడే కూర్చుంటానన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తాడిపత్రిలో పెన్నా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే.. ట్రాక్టర్లు, టిప్పర్లు, జేసీబీలను కాల్చిపడేస్తానని హెచ్చరించారు. తనపై ఎలాంటి కేసులు పెడతారో పెట్టుకోమన్నారు. నాలుగేళ్ల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా.. ఏ అధికారి పట్టించుకోవడం లేదన్నారు. అక్రమంగా ఇసుక తోలకూడదని కోర్టు నుండి ఆర్డర్ కూడా తెచ్చుకున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేను ప్రజలు పంచె విప్పి కొట్టడం ఖాయమన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అయితే.. వచ్చే సోమవారం నాటికి పెన్నా నది వద్ద ఇసుక రవాణా ఆపకపోతే అడ్డుకుంటానని అల్టిమేటం ఇవ్వడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.
మొత్తంగా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక రాజకీయం వేడి పుట్టిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై అధికార- విపక్షాల మధ్య యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. పెద్దారెడ్డి టార్గెట్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో వచ్చే సోమవారం ఏం జరుగుతుందో చూడాలి.