AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెలైన్ నీరే మొక్కకు ‘ ప్రాణం ‘.. ‘ ప్రకాశం ‘ లో వింత ప్రయోగం

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు…ప్రకృతిని పచ్చగా ఉంచుతూ, ఆహ్లాదంతో పాటుగా ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉన్నదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు. మొదట మొక్కలుగా ఉన్నా, పిదప వీటిలో చాలావరకు వృక్షాలుగా, మహావృక్షాలుగా రూపాన్ని సంతరించుకుంటాయి. తాము కార్బన్‌డై ఆక్సైడును పీల్చుకుంటూ, మనకేగాక, పశుపక్ష్యాదులకు అత్యవసరమైన ప్రాణవాయువునందిస్తూ త్యాగానికి మరో పేరుగా అలరారుతున్నాయి. అసలు ఇక్కడనుండే పరోపకారమనే పర్వానికి శ్రీకారం చుట్టడం ఆరంభమైంది. అలసిన మనసునకు చల్లని నీడనిచ్చి, చక్కని ప్రశాంతతను […]

సెలైన్ నీరే మొక్కకు ' ప్రాణం '.. ' ప్రకాశం ' లో వింత ప్రయోగం
Anil kumar poka
| Edited By: |

Updated on: Nov 02, 2019 | 4:41 PM

Share
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు…ప్రకృతిని పచ్చగా ఉంచుతూ, ఆహ్లాదంతో పాటుగా ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉన్నదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు. మొదట మొక్కలుగా ఉన్నా, పిదప వీటిలో చాలావరకు వృక్షాలుగా, మహావృక్షాలుగా రూపాన్ని సంతరించుకుంటాయి. తాము కార్బన్‌డై ఆక్సైడును పీల్చుకుంటూ, మనకేగాక, పశుపక్ష్యాదులకు అత్యవసరమైన ప్రాణవాయువునందిస్తూ త్యాగానికి మరో పేరుగా అలరారుతున్నాయి. అసలు ఇక్కడనుండే పరోపకారమనే పర్వానికి శ్రీకారం చుట్టడం ఆరంభమైంది. అలసిన మనసునకు చల్లని నీడనిచ్చి, చక్కని ప్రశాంతతను కలిగింపచేస్తాయి. రసవంతమైన ఫలాలనందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు అంగరక్షకులుగా వ్యవహరిస్తాయి. భూతాపాన్ని అరికడతాయి. భూసారాన్ని పెంచుతాయి. వర్షాల రాకకు కారకాలై కరువురక్కసిని పారద్రోలుతాయి. పసిడి పంటలతో వసుధను పరవశింపచేస్తాయి. గృహాలకు అత్యంత ఉపయోగకరమైన ఉపకరణాలుగా మారతాయి. అటువంటి మొక్కలను అతి జాగ్రత్తగా కాపాడుకునేందుకు ప్రకాశం జిల్లాలో కొందరు యువకులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. చంటి బిడ్డల్లా సాకుతూ..కంటికి రెప్పాల్లా పెంచుతున్నారు.
ప్రకాశం జిల్లా  పీసీ పల్లి మండలం చిలుకూరి వారి పల్లి లో యువకులు పచ్చదనం కోసం కృషి చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు గ్రామంలో చెట్లు లేకపోవడం,  స్థానికంగా ఎక్కువ మంది వృద్ధులు ఉండడం,  ఎండకు తట్టుకో లేక పోవడంతో రోజురోజుకీ పరిస్థితి క్లిష్టంగా మారడంతో. విద్యావంతులైన యువకులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు… గ్రామంలో విరివిగా మొక్కలు నాటి రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తలో చెయ్యి వేసి  20 వేల రూపాయలు. సమకూర్చుకున్నారు. సమిష్టిగా శ్రమదానం చేసి అన్ని వీధుల్లో గుంతలు తవ్వి..నీడనిచ్చే సుమారు 40 రకాల  మొక్కలు నాటారు. అవి పశువుల బారినపడకుండా ట్రీ గార్డ్స్‌ ఏర్పాటు చేశారు. మొక్కలకు ఎప్పుడూ తడి అందించేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఇందుకోసం వాడి పారేసిన సెలైన్ బాటిల్స్‌ని సేకరించారు..వాటిని మొక్కలకు కట్టారు. చుక్కలుగా నీరు మొక్కల వేర్లకు పడేలా ఏర్పాటు చేశారు. ఫలితంగా నాటిన మొక్కలు కలకలలాడుతూ  ఎదుగుతున్నాయి.. అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడంతో.. మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు చెట్లను సంరక్షించుకోవాలి. సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి కాపాడాలి. అప్పుడే వాతావరణ సమతౌల్యం పాటించినట్లు అవుతుందని వారు సూచిస్తున్నారు. స్థానికంగా మొక్కల పెంపకం చేపట్టిన యువకులను గ్రామస్తులు, స్థానికులు అభినందించారు.