అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రహదారిపై మృతిచెందిన వ్యక్తిని చూడబోయి మరో..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రమాదాన్ని
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రమాదాన్ని వీక్షించేందుకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన ధర్మవరం దగ్గరలోని బత్తలపల్లి మండలం రాఘవంపల్లి జాతీయ రహదారిపై జరిగింది. మొత్తంగా ఒకే ప్రదేశం వద్ద ఐదుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే..
బత్తలపల్లి నుంచి రాఘవంపల్లికి బైక్‌పై వెళుతున్న రాజశేఖర్ అనే వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొనడంతో ఎగిరిపడి కుడివైపున ఉన్న రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సంఘటన స్థలం వద్ద మృతదేహాన్ని చూడటానికి వచ్చిన జనంపై నుంచి అనంతపురం నుంచి కదిరి వెళుతున్న లారీ దూసుకెళ్లింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులు బత్తలపల్లి మండలం ముష్టూరు గ్రామానికి చెందిన శివమ్మ, సంజీవపురానికి చెందిన వలీసాబ్, అదే గ్రామానికి చెందిన సూరి, తాడిమర్రి మండలం నార్సంపల్లికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. అంతేకాకుండా లింగారెడ్డిపల్లికి చెందిన రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.