ఆ సీట్ జనసేనకు రాలేదని భార్యను బరిలోకి దింపాడు.. చివరకు చైర్‌పర్సన్ పీఠమే సొంతం!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు. పిఠాపురంలో పది వార్డులు, గొల్లప్రోలులో నాలుగు వార్డులు, ఏలూరులో పలువురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆదోనిలో జనసేన టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసిన స్వప్న మల్లప్ప నాయకర్ ఏకంగా చైర్‌పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల రెబల్ అభ్యర్థులు ట్విస్ట్ ఇచ్చారు. టికెట్ దక్కలేదని వెనక్కి తగ్గకుండా.. స్వతంత్రులుగా బరిలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. ఆదోనిలో జనసేన రెబల్ ఏకంగా చైర్‌పర్సన్ స్థానాన్నే దక్కించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రెబల్ అభ్యర్థులు ఊహించని విధంగా సత్తా చాటారు. పార్టీల టికెట్లు దక్కకపోయినా.. స్వతంత్రులుగా బరిలోకి దిగి ఓటర్ల మద్దతుతో విజయం సాధించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 36 వార్డులున్న పిఠాపురంలో ఏకంగా పది వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రెబల్స్ గెలుపు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన రెబల్ అభ్యర్థి గెలిచి ఈ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు.
ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠం జనసేన రెబల్ సొంతం
ఇక కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వప్న మల్లప్ప నాయకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి చైర్‌పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆదోని చైర్‌పర్సన్ స్థానం టీడీపీకి కేటాయించారు. నాగమణిని టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో జనసేన ఆదోని ఇన్‌చార్జి మల్లప్ప నాయకర్ తన భార్య స్వప్నను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. చివరకు ఆమె విజయం సాధించడంతో ఆదోని రాజకీయాల్లో ఈ ఎన్నిక ప్రత్యేకంగా నిలిచింది. స్వప్న భర్త మల్లప్ప నాయకర్ మాట్లాడుతూ.. స్వప్న గెలుపును పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా ఇస్తున్నామని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ పవన్ అభిమానిని అని.. ఆయనతోనే ఉంటానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తనకు అండగా ఉన్నారన్నారు..
గొల్లప్రోలులో 4 వార్డుల్లో రెబల్స్ గెలుపు
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులోనూ స్వతంత్ర అభ్యర్థులు పార్టీలకు షాక్ ఇచ్చారు. నాలుగు వార్డుల్లో రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇద్దరు జనసేన రెబల్స్, ఇద్దరు టీడీపీ రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచి గెలిచారు. ఇక ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు ప్రభావం చూపించారు. దాదాపు ఎనిమిది మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు.
మొత్తంగా ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల గెలుపు ప్రధాన పార్టీలకు కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తెచ్చింది. పిఠాపురం, గొల్లప్రోలు, ఏలూరులో కార్పొరేటర్, కౌన్సిలర్ స్థాయిలో రెబల్స్ సత్తా చాటగా.. ఆదోనిలో ఏకంగా చైర్‌పర్సన్ స్థానాన్ని రెబల్‌గా బరిలోకి దిగిన అభ్యర్థి సొంతం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
