AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో పడ్డ 28 వేల బాతు బొమ్మలు! 30 ఏళ్లుగా శాస్త్రవేత్తల వేట!

సముద్రంలో ఓడలు ప్రమాదాలకు గురవడం కొత్తేమీ కాదు. తుఫానులు, భారీ అలల కారణంగా ఎన్నో నౌకలు ప్రమాదాల్లో చిక్కుకుంటాయి. 1992లో ఓ వింత జరిగింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌక నుంచి వేలాది  పసుపు రంగు రబ్బరు బాతు బొమ్మలు నీటిలో పడ్డాయి. ఆశ్చర్యం ఏంటంటే.. మూడు దశాబ్దాలు గడిచినా ఆ బొమ్మల ప్రయాణంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలోని ఏయే ప్రాంతాలకు చేరుకున్నాయి? సముద్ర ప్రవాహాల గురించి అవి ఏం చెప్పాయి?

సముద్రంలో పడ్డ 28 వేల బాతు బొమ్మలు! 30 ఏళ్లుగా శాస్త్రవేత్తల వేట!
Unsinkable Rubber Ducks Fell Into The Sea
Sharada V
|

Updated on: Nov 04, 2026 | 8:55 AM

Share

1992లో ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భారీ తుఫాను వచ్చింది. హాంకాంగ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం టకోమాకు వెళ్తున్న ‘ఎవర్ లారెల్’ (Ever Laurel) అనే కార్గో నౌక ప్రయాణిస్తోంది. సముద్రంలో ఎగసిపడుతున్న భారీ అలల ధాటికి నౌకలోని 12 కంటైనర్లు నీటిలో పడిపోయాయి.

వాటిలో ఒక కంటైనర్‌లో 28,800 ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి. పసుపు రంగు రబ్బరు బాతులు, నీలం రంగు తాబేళ్లు, ఎరుపు రంగు బీవర్లు, ఆకుపచ్చ రంగు కప్పలు ఇలా నాలుగు రకాల బొమ్మలు అందులో ఉన్నాయి. చైనాలో తయారైన ఈ బొమ్మలను అమెరికాకు చెందిన ‘ది ఫస్ట్ ఇయర్స్’ కంపెనీ కోసం తయారు చేశారు. ఈ బొమ్మల ప్రత్యేకత ఏమిటంటే.. వాటికి రంధ్రాలు లేకపోవడంతో నీటిలో మునిగిపోకుండా తేలుతూ ఉండగలవు. దీంతో సముద్రపు అలలు, నీటి ప్రవాహాల వెంట అవి ప్రయాణించడం ప్రారంభించాయి.

వేల కిలోమీటర్లు ప్రయాణించి అలాస్కా తీరానికి..

సముద్రంలో పడిపోయిన ఈ బొమ్మలు మొదట అలాస్కాలోని సిట్కా ప్రాంతం సమీపంలోని తీరాలకు చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దాదాపు 2,000 మైళ్ల దూరంలో ఇవి కనిపించాయి. మొదట్లో ఇదొక సరదా సంఘటనగానే కనిపించింది. కానీ సముద్ర శాస్త్రవేత్తలు మాత్రం ఇందులో ఓ గొప్ప పరిశోధన అవకాశాన్ని గుర్తించారు. సముద్ర ప్రవాహాలు ఎలా ప్రయాణిస్తాయి? ఒక ప్రాంతంలో నీటిలో పడిన వస్తువులు వేల కిలోమీటర్ల దూరానికి ఎలా చేరుకుంటాయి? ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈ బొమ్మలు ఉపయోగపడతాయని భావించారు.

బొమ్మల కోసం వెతుకులాట.. 100 డాలర్ల బహుమతి!

సముద్ర శాస్త్రవేత్తలు కర్టిస్ ఎబ్బెస్‌మేయర్, జేమ్స్ ఇంగ్రహామ్ ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎబ్బెస్‌మేయర్ తీర ప్రాంతాల్లోని ప్రజల సహాయంతో బొమ్మలు ఎక్కడ, ఎప్పుడు కనిపించాయనే వివరాలను సేకరించడం ప్రారంభించారు. సముద్రం ఒడ్డున వస్తువులను వెతికే వారిని కూడా ఈ పరిశోధనలో భాగస్వాములను చేశారు. మరోవైపు ఇంగ్రహామ్ ‘OSCURS’ అనే కంప్యూటర్ మోడల్‌ను ఉపయోగించి సముద్రపు ఉపరితల ప్రవాహాలు ఏ దిశగా ప్రయాణిస్తాయో అంచనా వేశారు. రబ్బరు బాతు బొమ్మ ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇచ్చిన వారికి 100 డాలర్లు బహుమతిగా కూడా ప్రకటించారు.

సాధారణంగా సముద్ర ప్రవాహాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు సందేశాలు రాసిన సీసాలను సముద్రంలో వదులుతారు. అయితే వాటిలో కేవలం రెండు శాతం మాత్రమే తిరిగి లభించేవి. కానీ ఈసారి వేలాది బొమ్మలు ఒకే ప్రాంతం నుంచి, ఒకే సమయంలో సముద్రంలో పడిపోవడంతో వాటి ప్రయాణాన్ని అధ్యయనం చేయడానికి అరుదైన అవకాశం లభించింది.

మంచులో చిక్కుకున్న బొమ్మలు.. ఆ తర్వాత అట్లాంటిక్‌కు!

కొన్ని బొమ్మలు ఆర్కిటిక్ మహాసముద్రం వైపు ప్రయాణించి సముద్రపు మంచులో చిక్కుకున్నాయి. అక్కడ మంచు దిబ్బలతో పాటు రోజుకు కొన్ని కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉండిపోయాయి. కొంతకాలం తర్వాత మంచు కరిగినప్పుడు అవి తిరిగి నీటిలోకి చేరి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం వైపు వెళ్లినట్లు గమనించారు.

ఈ ప్రయాణంలో కొన్ని బొమ్మలు హవాయి దీవులు, అమెరికా అట్లాంటిక్ తీరం, బ్రిటన్, ఐర్లాండ్, కెనడాలోని తూర్పు ప్రాంతాల తీరాలకు చేరుకున్నాయి. అంటే ఒకే ప్రాంతంలో సముద్రంలో పడిపోయిన బొమ్మలు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నాయి.

11 ఏళ్ల పాటు కంప్యూటర్‌లో ప్రయోగం!

ఈ బొమ్మల ప్రయాణాన్ని మరింత కచ్చితంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కంప్యూటర్ ఆధారిత ప్రయోగం చేసారు. 1992 జనవరి 10న బొమ్మలు సముద్రంలో పడిపోయిన అదే ప్రాంతంలో, అదే సమయంలో 70 వర్చువల్ బొమ్మలను కంప్యూటర్ మోడల్‌లో ప్రవేశపెట్టారు.

ఆ తర్వాత వాటి ప్రయాణాన్ని 11 సంవత్సరాల 6 నెలల పాటు పరిశీలించారు. 2003 జూలై 19 వరకు కంప్యూటర్ అంచనాలను వాస్తవంగా తీరాలకు చేరుకున్న బొమ్మల వివరాలతో పోల్చారు. ఈ ప్రయోగం ద్వారా సముద్ర ప్రవాహాల కంప్యూటర్ నమూనాలు ఎంతవరకు కచ్చితంగా పనిచేస్తున్నాయో తెలుసుకునే అవకాశం లభించింది. సముద్రంలో ఏర్పడే భారీ వలయాకార ప్రవాహ వ్యవస్థను ఒకసారి చుట్టి రావడానికి ఈ బొమ్మలకు సుమారు మూడేళ్లు పట్టవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

సముద్ర కాలుష్యంపై పరిశోధనలకు కీలక ఆధారం

ఈ ఘటన కేవలం బొమ్మల ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన కథగా మాత్రమే మిగిలిపోలేదు. సముద్ర ప్రవాహాలపై శాస్త్రవేత్తలకు ఎన్నో కొత్త విషయాలను తెలియజేసింది. పసిఫిక్ మహాసముద్రంలోని భారీ ప్రవాహ వ్యవస్థలు ఎంత సమయం తీసుకుని ఒక చుట్టు తిరుగుతాయి? సముద్రంలో పడిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంత దూరం ప్రయాణిస్తాయి? ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడింది.

ముఖ్యంగా సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, మైక్రోప్లాస్టిక్స్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎలా చేరుకుంటాయో తెలుసుకోవడానికి కీలకంగా నిలిచింది. భూమిపై ఉన్న మహాసముద్రాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేసింది.

ఇప్పుడు ఆ బొమ్మలు ఎక్కడున్నాయి?

సూర్యరశ్మి, సముద్రపు అలల ప్రభావంతో ఈ బొమ్మల్లో చాలా వరకు దెబ్బతిన్నాయి. కొన్ని పూర్తిగా విచ్ఛిన్నమై ప్లాస్టిక్ వ్యర్థాలుగా మారిపోయాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని బొమ్మలు సముద్ర తీరాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వాటిలో అసలైన 1992 నాటి బొమ్మలు కొన్ని ఆన్‌లైన్‌లో వేల డాలర్ల వరకు ధర పలికాయి.

ఓడ ప్రమాదంలో సముద్రంలో పడిపోయిన చిన్న చిన్న బొమ్మలు.. చివరికి ప్రపంచ మహాసముద్రాల రహస్యాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఆధారాలుగా మారాయి. సముద్ర ప్రవాహాల శక్తి ఎంత గొప్పదో, ప్రపంచంలోని వివిధ సముద్రాలు ఒకదానితో మరొకటి ఎలా అనుసంధానమై ఉన్నాయో ఈ రబ్బరు బాతుల ప్రయాణం చాటి చెప్పింది.

Follow Us
సముద్రంలో 28 వేల బాతు బొమ్మలు! 30 ఏళ్లుగా శాస్త్రవేత్తల వేట
సముద్రంలో 28 వేల బాతు బొమ్మలు! 30 ఏళ్లుగా శాస్త్రవేత్తల వేట
ఎకరంన్నర భూమి విషయంలో గొడవ.. తమ్ముడి భార్యను దారుణంగా..
ఎకరంన్నర భూమి విషయంలో గొడవ.. తమ్ముడి భార్యను దారుణంగా..
హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. దీపావళికి ముందే విద్యార్థులకు సెలవులు
హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. దీపావళికి ముందే విద్యార్థులకు సెలవులు
14 బంతుల్లో పాక్ ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా ప్లేయర్
14 బంతుల్లో పాక్ ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా ప్లేయర్
పక్షులను రాతి విగ్రహాలుగా మార్చే సరస్సు.. అసలు రహస్యం ఏంటంటే?
పక్షులను రాతి విగ్రహాలుగా మార్చే సరస్సు.. అసలు రహస్యం ఏంటంటే?
ఇప్పుడున్న హీరోలలో అతడి టాలెంట్ చూసి ఆశ్చర్యపోయా..
ఇప్పుడున్న హీరోలలో అతడి టాలెంట్ చూసి ఆశ్చర్యపోయా..
చిల్లర విషయంలో గొడవ.. బస్సులోంచి పడిపోయిన కండక్టర్ ప్రవళిక మృతి
చిల్లర విషయంలో గొడవ.. బస్సులోంచి పడిపోయిన కండక్టర్ ప్రవళిక మృతి
ధంతేరస్ నుంచి దీపావళి వరకు షాపింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఏ రోజు..
ధంతేరస్ నుంచి దీపావళి వరకు షాపింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఏ రోజు..
చిత్తూరులో మృత్యుఘోష.. రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం!
చిత్తూరులో మృత్యుఘోష.. రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం!
భారత్, పాక్ మధ్య ఏకంగా 10 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
భారత్, పాక్ మధ్య ఏకంగా 10 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?