AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 కార్పొరేషన్లలో కూటమి హవా.. ఆ ఒక్క కార్పొరేషన్‌లో మాత్రం వైసీపీ జెండా! అసలేం జరిగిందో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో 13 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల కూటమి విజయం సాధించగా, అనంతపురంలో మాత్రం వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థి ఓటమికి అభ్యర్థి ఎంపిక, టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలు కారణమయ్యాయా? మేనిఫెస్టో హామీలు కూడా ప్రభావం చూపాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

12 కార్పొరేషన్లలో కూటమి హవా.. ఆ ఒక్క కార్పొరేషన్‌లో మాత్రం వైసీపీ జెండా! అసలేం జరిగిందో తెలుసా..?
Anantapur Mayor Election Results
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2026 | 7:39 AM

Share

ఆంధ్రా అంతా వార్ వన్‌ సైడ్‌.. కానీ అనంతపుర పోరులో మరోసైడ్‌.. ఏపీలో 13 కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగితే 12కార్పొరేషన్లలో కూటమి హవా కొనసాగింది. 10 మేయర్లను టీడీపీ కైవసం చేసుకుంటే 2 సీట్లు జనసేన ఖాతాలోకి వెళ్లాయి. కానీ బీజేపీకి కేటాయించిన అనంతపురం మాత్రం చేజారియింది. అనంతపురంలో ఫ్యాన్ గాలివీచింది. వైసీపీ గెలిచింది. బీజేపీ ఓటమికి కారణమేంటి? సమన్వయ లోపమా? లేక బీజేపీ అభ్యర్థే మైనస్ అయ్యారా? అయితే కర్ణుడి చావుకు 100కారణాలన్నట్టు తమ ఓటమికి రకరకాల కారణాలు చెబుతోంది బీజేపీ..

అనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 12 కార్పొరేషన్ లలో కౌంటింగ్ ప్రారంభం నుంచే కూటమి ఎదురులేకుండా దూసుకెళ్లి విజయం సాధించగా.. అనంతపురంలో మాత్రం బీజేపీ-వైసీపీ మధ్య విజయం దోబూచులాడింది. చివరికి 5వేల 981 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి 62 వేల ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థి అజేష్ బాబుకు 56వేల 238 ఓట్లు వచ్చాయి. అనంతరం మాట్లాడిన బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ బాబు కౌంటింగ్ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేశారు.

అనంతపురం కార్పొరేషన్‌లో మొత్తం 62 డివిజన్లు ఉంటే టీడీపీ 30, జనసేన 6, బీజేపీ ఒక సీటులో గెలుపొందాయి. వైసీపీ 24 డివిజన్లలో గెలిచింది. ఇండిపెండెంట్లు నాలుగు స్థానాల్లో గెలిచారు. మిగతా 12 కార్పొరేషన్లలోని డివిజన్లలో వార్ వన్ సైడ్ అన్నట్టు సాగితే ఇక్కడ మాత్రం వైసీపీ కాస్త గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి.

అనంతపురం మేయర్ సీటును కోల్పోవడంపై కూటమిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అనంతపురం మేయర్ సీటును బీజేపీకి ఇవ్వకుండా టీడీపీ తీసుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీకి సీటు కేటాయించినా ఆ పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల సేమ్ రిజల్ట్ వచ్చేదని ఇంకోవాదన వినిపిస్తోంది. టీడీపీ అంతర్గత విభేదాలు బీజేపీ కొంప ముంచాయా అన్న ప్రశ్నలు తలెత్తాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు కూటమి ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు.

కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బీజేపీ ఓటమికి మరోకారణంగా కనిపిస్తోంది.అనంతపురం మేయర్ స్థానాన్ని ముందు నుంచీ టీడీపీ ఆశించింది. కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా చివరి నిమిషంలో ఈ సీటు బీజేపీకి దక్కింది. క్షేత్రస్థాయిలో టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయలోపం కనిపించిందన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.

కూటమికి అభ్యర్ధి ఎంపికే మైనస్‌ గా మారిందన్న చర్చ తెరపైకి వచ్చింది. అభ్యర్థి ఎంపికపై బీజేపీలోనే భిన్నస్వరాలు వినిపించాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లను పక్కనబెట్టి అజేష్‌ బాబుకు టికెట్ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. దీంతో సీనియర్ బీజేపీ నేతలు కూడా మనస్ఫూర్తిగా పనిచేయలేదన్న ఆరోపణలున్నాయి.

అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోను వైసీపీ ప్రచారాస్త్రంగా మార్చుకోవడంలో సఫలమైందని మరికొందరు చెబుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోకి రాని ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, హార్టికల్చర్ హబ్ హామీలను ఇచ్చిందని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు రాల్చుకుందని టాక్‌..

కూటమి తరపున పోటీ చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థికి మైనార్టీల ఓట్లు రాబట్టుకోలేకపోయారన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల సందర్బంగా జరిగిన ఘర్షణలు కూడా కూటమికి మైనస్‌గా మారినట్టు తెలుస్తోంది.

Follow Us