Pothina Mahesh: జనసేనలో కలకలం సృష్టిస్తున్న పోతన మహేష్ ప్రెస్ నోట్..!

జనసేన నుంచి విజయవాడ వెస్ట్‌ టికెట్‌ ఆశించిన పోతిన మహేశ్‌ వెనక్కు తగ్గడం లేదు. న్యాయం చేస్తామని పవన్‌ బుజ్జగించినా వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ గీత ఎవరు దాటినా వేటేనంటూ పవన్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేయడంతో మహేశ్‌ ఏం చేయబోతున్నారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Pothina Mahesh: జనసేనలో కలకలం సృష్టిస్తున్న పోతన మహేష్ ప్రెస్ నోట్..!
Pothina Mahesh Pawan Kalyan
Follow us

|

Updated on: Mar 28, 2024 | 7:54 AM

జనసేన నుంచి విజయవాడ వెస్ట్‌ టికెట్‌ ఆశించిన పోతిన మహేశ్‌ వెనక్కు తగ్గడం లేదు. న్యాయం చేస్తామని పవన్‌ బుజ్జగించినా వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ గీత ఎవరు దాటినా వేటేనంటూ పవన్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేయడంతో మహేశ్‌ ఏం చేయబోతున్నారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. సర్దుకుంటారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది.

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్‌ సీటు బీజేపీకి దక్కింది. బీజేపీ తరపున సుజనా చౌదరి బరిలోకి దిగారు. మరోవైపు పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు జనసేనకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్‌ను జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఇటీవలే ఆందోళనలు కూడా చేశారు పోతిన. టికెట్ తనకే ఇవ్వాలంటూ పార్టీ ఆఫీస్‌లో 2 గంటలపాటు నిరసన దీక్ష కూడా చేపట్టారు. తనకు సీటు ఇవ్వడమే న్యాయం, ధర్మమని వాదించారు పోతిన. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశానని, పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పుకొచ్చారాయన. ఎన్ని ఇబ్బందులొచ్చినా జనసేనకోసం పనిచేశానని, పవన్‌ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని భావించారు పోతిన మహేష్.

విజయవాడ వెస్ట్‌ టికెట్‌పై మంకుపట్టు పడుతోన్న పోతిన మహేష్‌తో మూడోసారి సమావేశమైన పవన్‌ కల్యాణ్‌ బుజ్జగించేందుకు యత్నించారు. అధికారంలోకి వస్తే కీలకమైన పదవి ఇస్తామంటూ భరోసా కూడా ఇచ్చారు. అయినా… విజయవాడ వెస్ట్‌ సీటు కావాల్సిందేనంటూ పోతిన పట్టుబట్టారు.

ఈ తరుణంలో పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారందులో. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారాయన. మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలని, మిత్ర పక్ష కూటమిని గెలిపిద్దామంటూ ప్రెస్‌నోట్‌లో స్పష్టం చేశారు పవన్‌కల్యాణ్‌.

తాజా ప్రెస్‌ నోట్‌తో పవన్‌ కల్యాణ్‌ జనసేనలోని అసమ్మతులందరికీ షాక్‌ ఇచ్చినట్లైంది. అనేక నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన జనసేన నాయకులందరికీ ప్రెస్‌నోట్‌ హెచ్చరికలా మారింది. పోతిన సహా అనేక మంది జనసేన ఆశావహులు పవన్‌ తాజా ప్రెస్‌నోట్‌తో ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆశావహులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. పొత్తుల నేపథ్యంలో త్యాగాలు చేయకతప్పదంటూ పవన్‌ ముందునుంచే కేడర్‌కు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అయితే ఈ తరహాలో త్యాగాలు చేయాల్సి వస్తుందని తాము ఊహించలేదని పార్టీ నేతలు వాపోతున్నారు. అనేక చోట్ల ఇప్పటికే కొందరు జనసేన ఆశావహులు తిరుగుబావుటా ఎగురవేశారు. మరికొందరు నేడో, రేపో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

ముఖ్యంగా పోతిన మహేశ్‌ తన భవిష్యత్ కార్యాచరణపై ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పవన్‌ తాజా ప్రెస్‌ నోట్ నేపథ్యంలో పోతిన సర్దుకుంటారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. పోతిన దారెటనేది రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…