Andhra Pradesh: రాజ్యసభకు నాగబాబు..? రేసులో కీలక నేతలు.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్‌ మొదలైంది. ఈ పంపకం ఎలా జరగబోతోంది..? తెలుగుదేశం పార్టీయే ఈ మూడు స్థానాలనూ తీసుకుంటుందా..? లేక జనసేన, బీజేపీలతో షేర్‌ చేసుకుంటుందా..? గతంలో 2014 ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లను ఇచ్చింది.. అనే చర్చ నడుస్తోంది.

Andhra Pradesh: రాజ్యసభకు నాగబాబు..? రేసులో కీలక నేతలు.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ
Ap Politics
Follow us
Eswar Chennupalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 27, 2024 | 1:24 PM

ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్‌ మొదలైంది. ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్‌. దాంతో, కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది. మరి, మూడు సీట్లను సమానంగా ముగ్గురూ పంచుకుంటారా? లేక లెక్కల ప్రకారం ముందుకెళ్తారా?. అసలు, రాజ్యసభ రేస్‌లో ఎవరున్నారు?. ఏ పార్టీ నుంచి ఎవరు సీటు ఆశిస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది..

ఏపీలో రాజ్యసభ రేస్‌ ఉత్కంఠ రేపుతోంది. రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీపడుతున్నారు కూటమి నేతలు.. అయితే, మూడు స్థానాల్లో ఒకటి టీడీపీకి దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు.. మిగతా రెండు సీట్లలో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని.. మూడో స్థానం కోసం టీడీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉందని అంటున్నారు. ఇక.. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, గల్లా జయదేవ్‌ పోటీపడుతున్నట్టు సమాచారం..! అలాగే, జనసేన నుంచి నాగబాబు.. బీజేపీ నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రేస్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే.. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటికి నాలుగేళ్ల చొప్పున పదవీకాలం ఉండగా.. ఒక్కదానికి మాత్రం కేవలం రెండేళ్ల టర్మ్‌ మాత్రమే మిగులుంది. దాంతో, నాలుగేళ్లు పదవీకాలం ఉన్న సీట్ల కోసమే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. నాలుగేళ్ల టర్మ్‌ ఉన్న సీట్లలో ఒకటి టీడీపీకి ఖరారైందట. రీసెంట్‌గా రాజ్యసభకు రాజీనామా చేసిన బీద మస్తాన్‌రావే.. మళ్లీ ఈ సీటును దక్కించుకోబోతున్నట్టు సమాచారం.

నాలుగేళ్ల టర్మ్‌ ఉన్న రెండో సీటు కోసం విపరీతమైన పోటీ నడుస్తోంది. ఈ సీటును జనసేనకు ఇస్తే మెగా బ్రదర్‌ నాగబాబుకు అవకాశం ఇవ్వొచ్చని టాక్‌. ఒకవేళ రెండేళ్ల టర్మ్ సీటును గాని జనసేనకు కేటాయిస్తే మాత్రం నాగబాబు తప్పుకోవచ్చనే మాట వినిపిస్తోంది.

ఇక, బీజేపీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కిరణ్‌కు బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందని.. కచ్చితంగా సీటు దక్కొచ్చని అంటున్నారు.

ఇక, టీడీపీ నుంచి సీనియర్‌ లీడర్లు కంభంపాటి రామ్మోహన్‌రావు, గల్లా జయదేవ్‌ పోటీపడుతున్నారు. కాకినాడకు చెందిన సానా సతీష్‌ కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది.

నామినేషన్లకు ఇంకా మూడ్రోజులు మాత్రమే టైముంది. ఈనెల 30లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. మరి, మూడు సీట్లను మూడు పార్టీలూ సమానంగా పంచుకుంటాయా? లేక లెక్క మారుతుందా?. మరో మూడ్రోజుల్లో తేలిపోనుంది.

గత ఫార్మూలాను పరిశీలిస్తే..

గతంలో 2014 ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లను ఇచ్చింది.. అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్‌సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం అన్ని చట్టసభల్లో జనసేన ఖాతా తెరచినట్లవుతుంది. జనసేనతో పాటు టీడీపీకి కూడా ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ మూడు రాజ్యసభ బెర్త్‌లు ఏ పార్టీ ఖాతాలో వెళతాయి.. అదృష్ట జాతకులు ఎవరౌతారు అనేదే అత్యంత ఆసక్తికరం.

అయితే, గత కొన్నేళ్లుగా రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోయింది. దీంతో తిరిగి పూర్వ వైభవం దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ముగ్గురు వైఎస్ఆర్సీపీ సభ్యులు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ మూడు ఖాళీల విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది.. ఆసక్తికరంగా మారింది.

175 అసెంబ్లీ స్థానాలు..

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 164 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎమ్మెల్యేలు 11 మంది మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేదు.. దీంతో మున్ముందు ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలన్నీ టీడీపీ కూటమికే దక్కనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..