Kadapa News: కడప నగరానికి మూడోసారి వరద ముప్పు తప్పదా? భయాందోళనలో నగర జనం..
Kadapa News: కడప నగరానికి మూడో సారి వరద ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు సార్లు కడప నగరంపైకి బుగ్గవంక వరద నీరు విరుచుకుపడడంతో సర్వస్వం కొల్పయి..
కడప నగరానికి మూడో సారి వరద ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు సార్లు కడప నగరంపైకి బుగ్గవంక వరద నీరు విరుచుకుపడడంతో సర్వస్వం కొల్పయి ఆ గాయాలు మానకముందే మరోసారి వరద ముప్పు పొంచి ఉందనే వార్త నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాల సీజన్ మొదలుకావడంతో కడప నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. చిన్నపాటి తుపాను వస్తే చాలు బుగ్గవంక జలాశయం నిండిపోతున్న పరిస్థితుల్లో బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో మూడోసారి వరదలు ముంచెత్తవచ్చని బుగ్గవంక పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్ కొన్ని చోట్ల అసంపూర్తిగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాకపోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో జీవిస్తున్నారు.
సరిగ్గా 2001, అక్టోబరు 16 వ తేది.. బుగ్గవంక వరద నీరు కడప నగరంపై తొలిసారి జలఖడ్గాన్ని దూసిన రోజు. ఆ జల విలయంలో సుమారు పదుల సంఖ్యలో మృతి చెందగా, వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. నాటి జలవిలయంలో కొందరు గల్లంతయ్యారు. ఆ గాయం మానకముందే 2020 నవంబరు 26న మరోసారి బుగ్గవంక కడప నగరంపైకి దూసుకొచ్చింది.చూస్తూ ఉండగానే ముంచేసింది..మొదటి ఘటనకు రెండో ఉత్పాతానికి మధ్య 19 ఏళ్ల గ్యాప్ ఉన్నా ఆ గాయాలు మాత్రం మానలేదు..అధికారులు మారలేదు..ఈ కాలంలో అధికార, పాలక యంత్రాంగం బుగ్గవంక అభివృద్ధి పనులు పూర్తి చేసి ఉంటే రెండో సారి ఆ వంక కడప నగరంపై విరుచుకుపడేది కాదని పరివాహక ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.రెండోసారి ఉపద్రవం సంభవించి ఇప్పటికి ఏడు నెలలకు పైగా గడిచిపోయింది.మళ్ళీ వర్షాకాలం వచ్చింది.. మళ్ళీ పై నుంచి వరద నీరు బుగ్గవంక జలాశయం కి చేరితే మళ్ళీ మా పరిస్థితి ఏంటని నగర వాసులు వాపోతున్నారు.
ఈసారి బుగ్గవంక జలాశయం కి వరద నీరు వచ్చి చేరితే మళ్ళీ మూడోసారి కడప వాసులను వరదనీరు ముంచేస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ప్రమాదం,భయం ప్రతిసారి రావడానికి ప్రధాన కారణం….బుగ్గవంక నీరు సరైన క్రమంలో వెళ్లేందుకు ఇరు వైపులా ప్రొటెక్షన్ వాల్(రక్షణ గోడ) కొన్ని చోట్ల లేకపోవడమే. అవును..బుగ్గవంక నీరు కడప నగరంలో నుంచి కిందికి వెళ్లే క్రమంలో రక్షణ గోడ నిర్మాణం కొన్ని ఏరియాల్లో లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల రక్షణ గోడకి గ్యాప్ లు ఉండడంతో చుట్టూ పక్కల ఉన్న కాలనీలు పూర్తి స్థాయిలో మునిగిపోయి మొత్తం కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పటికి రెండు సార్లు దెబ్బ తిన్న తర్వాత అధికార యంత్రాంగం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకొని పోవడంతో నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అయినా ఇప్పటికీ పనులు అసంపూర్తిగానే ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్(రక్షణ గోడ) కి నిధులు విడుదల చేసినప్పటికీ కొన్ని పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. మరికొన్ని చోట్ల పనులు అసంపూర్తి గా ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో ని తారకరామనగర్ నుంచి కాగితాల పెంట వరకు,పాతబస్టాండు నుంచి అల్మాస్‌పేట వరకు రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు. కాగితాలపెంట పైవంతెన నుంచి పాతబస్టాండు వరకు రక్షణ గోడ నిర్మాణం పూర్తి కాలేదు. 2020, నవంబరు 26న వచ్చిన వరదలకు రక్షణ గోడల్లేని ప్రాంతాలలో నాగరాజుపేట, రవీంద్రనగర్, మోచంపేట, గుర్రాలగడ్డ, బ్రాహ్మణవీధి, మురాదియానగర్ తదితర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ఇళ్లను వదిలి సహాయక శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది.బుగ్గవంక ముంపు నుంచి తారకరామనగర్, ద్వారకానగర్, రాజీవ్‌గాంధీనగర్, నాగరాజుపేట, రవీంద్రనగర్,పాతబస్టాండు, వన్‌టౌన్, వైవీస్ట్రీట్, గుర్రాలగడ్డ, బ్రాహ్మణవీధి, మోచంపేట, భవానీనగర్, మరాఠీవీధి, వక్కలపేట ప్రాంతాలను కాపాడడానికి వంకకి ఇరువైపులా 8,150 మీటర్ల రక్షణగోడను నిర్మించాలని 2007లో నిర్ణయించారు. ఇప్పటివరకు 6,950 మీటర్లు నిర్మించారు.ఇంకా 1200 మీటర్ల మేర పెండింగులో నిర్మించాల్సి ఉంది.నాగరాజు పేట రవీంద్ర నగర దగ్గర ఉన్న ఇల్లులు అన్ని కూల్చివేశారు కానీ ఇంకా అక్కడ ప్రొటెక్షన్ వాల్ ఇంకా కట్టలేదు. బాలాజీ నగర్ లో ప్రొటెక్షన్ వాల్ సగం వరకే కట్టి పనులు అసంపూర్తి గానే వదిలిపెట్టేరని ప్రజలు వాపోతున్నారు.
ఇప్పటికి రెండు సార్లు మమ్మల్ని వరద నీరు ముంచెత్తింది.. రెండు సార్లు సర్వస్వం కోల్పోయాం..ఆ సమయంలో కేవలం మనిషికి 500 రూపాయల ఇచ్చి సరి పెట్టారు…కానీ ఇప్పుడైనా బుగ్గవంక రక్షణ గోడ ని పూర్తి చేయండని సుబ్బన్న నగర వాసి వేడుకుంటున్నారు. మరికొందరు రక్షణ గోడ సగం వరకే కట్టారు..మధ్యలో ఆపేశారు.. పనులు జరగడం లేదు..బుగ్గవంక కి నీరు వస్తే మునిగిపోయే మొదటి ఇల్లు మాదే అంటూ వాపోతున్నారు.. ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. అధికారులు త్వరగా పూర్తి చేయాలని బాలాజీ నగర్ కాలనివాసులు కోరుతున్నారు.
బుగ్గవంక రక్షణ గోడ కోసం ఎన్నో సంవత్సరాలు గా కడప వాసులు ఎదురుచూస్తునే ఉన్నారు..కానీ అధికారులు నిర్లక్ష్యం తోనే ఇన్ని సంవత్సరాలు అయిన రక్షణ గోడ పూర్తి కాలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు.రెండు సార్లు వరద నీరు వచ్చి ముంచినప్పుడు వచ్చి కేవలం 500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు..మళ్ళీ అదే పని చేయాలని అనుకున్నారా..ఇప్పటికైనా రక్షణ గోడ పనులు పూర్తి చేసి కడప వాసులను రక్షించాలని కోరుతున్నామనన్నారు..
ఇప్పటికే రెండు సార్లు బుగ్గవంక వరద నీరు తో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు మూడో సారి ఇబ్బందులు పడకుండా చూడాలని మొరపెట్టుకుంటున్నారు. అధికార యంత్రాంగం కొన్ని రక్షణ గోడ పనులు కొన్ని చోట్ల పూర్తి చేసినప్పటికీ ఇంకొన్ని చోట్ల ఉన్న అసంపూర్తి పనులు పూర్తి చేస్తే కడప మరో సారి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఉంది.లేకపోతే మళ్ళీ కడప నగరానికి వరద ముప్పు తప్పదని పలువురు భావిస్తున్నారు.
(సేరి సురేష్, టీవీ9 తెలుగు, కడప)
Also Read..
ఏపీ-తెలంగాణ జలవివాదం.. కేంద్రం గెజిట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రులు బాలినేని, సురేష్..