AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరి చూపు ఆ టికెట్ పైనే.. నామినేషన్ వేళ రాజకీయ ఉత్కంఠ..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి అభ్యర్థి విషయంలో మరో ట్విస్ట్‌ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామృకృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్‌ ఇచ్చేందుకు బీజేపీ యోచిస్తోంది. అటు.. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృష్ణంరాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బుజ్జగించడంతో అనపర్తి టిక్కెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు అవుతోంది.

అందరి చూపు ఆ టికెట్ పైనే.. నామినేషన్ వేళ రాజకీయ ఉత్కంఠ..
Bjp And Tdp
Srikar T
|

Updated on: Apr 22, 2024 | 7:09 AM

Share

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి అభ్యర్థి విషయంలో మరో ట్విస్ట్‌ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామృకృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్‌ ఇచ్చేందుకు బీజేపీ యోచిస్తోంది. అటు.. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృష్ణంరాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బుజ్జగించడంతో అనపర్తి టిక్కెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు అవుతోంది. ఒకట్రెండు రోజుల్లో అనపర్తి కూటమి అభ్యర్థి విషయంలో ఏపీ బీజేపీ క్లారిటీ ఇవ్వనుంది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే టిక్కెట్‌పై కూటమిలో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతోంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేసేలా ఒప్పించారు టీడీపీ, బీజేపీ నేతలు. అంతకుముందు టీడీపీ నుంచే పోటీ చేస్తానని నల్లమిల్లి పట్టబట్టగా.. చంద్రబాబు, బుచ్చయ్యచౌదరి, బీజేపీ నేతలతో చర్చల తర్వాత.. కమలం పార్టీ నుంచి పోటీకి అంగీకరించారు. ఈ సందర్భంగా.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందన్నారు టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. టీడీపీని వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా.. పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు మాటే శిరోధార్యమంటూ.. త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆ వెంటనే.. రామవరంలో బీజేపీ నాయకులతో సమావేశమైన నల్లమిల్లి.. ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు.

మరోవైపు.. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే శివరామకృష్ణంరాజు ఆ పార్టీ ప్రకటించింది. అనపర్తి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న ఆయన.. ఒకట్రెండు రోజుల్లో నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ.. మారిన పొలిటికల్‌ ఈక్వేషన్స్‌తో శివరామకృష్ణంరాజు ప్లేస్‌లో బీజేపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బరిలో దించబోతున్నారు కూటమి నేతలు. ఇక.. అనపర్తి సీటు మార్పు నేపథ్యంలో బీజేపీ కూటమి అభ్యర్థి శివరామకృష్ణంరాజుతో ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనపర్తి అభ్యర్థి మార్పుపై చర్చించారు. శివరామకృష్ణంరాజుకు బుజ్జగించి.. తాజా రాజకీయ పరిణామాలను వివరించారు పురందేశ్వరి. బీజేపీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని శివరామకృష్ణంరాజు కూడా ప్రకటించడంతోఅనపర్తి టిక్కెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు అయింది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. అయితే.. అనపర్తి టికెట్‌ తనకే కేటాయించాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అనపర్తికి బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. సమీకరణలు కుదరకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా.. గత కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపిన అనపర్తి టిక్కెట్‌పై క్లారిటీ వచ్చింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధం కావడం.. టిక్కెట్‌ ఎవరికి ఇచ్చినా కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని శివరామకృష్ణంరాజు చెప్పడంతో చిక్కుముడి వీడింది. నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అనపర్తి టిక్కెట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…