Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో యువకుడు హల్‌చల్.. బస్సుకు నిప్పు పెట్టి.. పోలీసులకు చుక్కలు చూపించి..
Andhra Pradesh: ఏపీలో ప్రకాశంజిల్లా కనిగిరిలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. పామూరు బస్టాండ్ సెంటర్‌లో ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Andhra Pradesh: ఏపీలో ప్రకాశంజిల్లా కనిగిరిలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. పామూరు బస్టాండ్ సెంటర్‌లో ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేశారు. కాగా, ఈ సంఘటనలో బస్సు పాక్షికంగా దగ్దమైంది. పెట్రోల్ పోసిన యువకుడు వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలుగా గుర్తించారు. ఇక ఆర్టీసీ సిబ్బంది సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఏడుకొండలును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో అతనికి మతిస్థిమితం లేనట్టుగా గుర్తించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి ధరలకు నిరసనగా బస్సుకు నిప్పంటించానని, ధరలు తగ్గేందుకు అందరూ పూజలు చేయాలంటూ ఏడుకొండలు వింత వింతగా మాట్లాడాడు. అయితే, ఏడుకొండలు ధరించిన టీ షర్ట్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది. ఈ నేపథ్యం జనసేన కార్యకర్తలకు ఏడుకొండలుతో ఏమైనా పరిచయాలు ఉన్నాయేమో అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, దీనికి ముందు అంటే.. బస్సుకు నిప్పంటించే సమయంలో బస్సులో ఉన్న ఏడుకొండలు డ్రైవర్ సీటు విండోలో నుంచి మాట్లాడుతూ సీయం జగన్ వచ్చి పెరిగిన ధరలపై సమాధానం చెప్పాలని పెద్ద పెద్దగా అరిచాడు. దాంతో అలర్ట్ అయిన స్థానికులు అతన్ని వారించేందుకు ప్రయత్నించారు. మరింత రెచ్చిపోయిన ఏడుకొండలు వారిని బూతులు తిట్టాడు. ఇక ఏడుకొండలు ని పట్టుకునేందుకు వచ్చిన పోలీసులకు సైతం చుక్కలు చూపించాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. చివరకు ఏడుకొండలును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
MP Pragya Thakur: కబడ్డీ.. కబడ్డీ.. పండుగ సమయంలో క్రీడాకారులతో కబడ్డీ ఆడిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్..
Rare Sea Fish: మత్స్యకారుల వలకు చిక్కున అరుదైన సోఠారి చేప.. వేలం వేస్తే ఊహించని రీతిలో..