Srisailam Reservoir: ఎండిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్‌.. 6 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. అన్నదాత ఆవేదన

శ్రీశైలం ఎండిపోతోంది. పొలాలు వట్టిపోతున్నాయి. రిజర్వాయర్‌ను చూస్తే నీటి నిల్వ అడుగంటిపోయి పాతాళ గంగను తలపిస్తోంది. ఇక మా పొలాలకు నీళ్లొచ్చెదెట్లా అని రైతులు వాపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు...శ్రీశైలం ప్రాజెక్ట్‌ మీద ఆధారపడ్డ 6 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

Srisailam Reservoir: ఎండిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్‌.. 6 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. అన్నదాత ఆవేదన
Srisailam Reservoir
Follow us
Surya Kala

|

Updated on: Sep 26, 2023 | 7:22 AM

ఇక్కడ వర్షాలు లేవు…పైనుంచి వరదలు లేవు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. వరద నీరు లేకపోవడం, ఉన్న నీటిని విద్యుత్‌ అవసరాలకు వినియోగించడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ పాతాళానికి పడిపోయింది. దీంతో పంటలకు నీళ్లు వదిలే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఈ ఏడాది వరద లేకపోవడంతో ఆరు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీనివల్ల నంద్యాల జిల్లాకే అత్యధిక నష్టం జరిగింది. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 86 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 885 అడుగులు ఉండాల్సిన నీటిమట్టం….ప్రస్తుతం 853 అడుగులకు పడిపోయింది. నీటి మట్టం 854 అడుగులకు పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. ఆ అవకాశం లేకపోవడంతో నీటి విడుదలకు అడ్డుకట్ట పడింది. దీంతో తెలుగు గంగ, ఎస్సార్‌బీసీ, కేసీ కెనాల్ కింద ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.

రిజర్వాయర్‌లో నీటిమట్టం బాగా పడిపోవడంతో వరి పంటకు నీరు ఇవ్వలేమని, ఆరుతడి పంటలకు మాత్రమే నీరిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ కొందరు రైతులు వరి నాట్లు వేశారు. దీంతో అవి కాస్తా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి సాగు నీటి విడుదల కష్టమే అంటున్నారు అధికారులు. అక్టోబర్ 19 వరకు వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ..అవి ఎప్పుడు వస్తాయో… వచ్చినా వరదలు వస్తాయా అనేది అనుమానమే అంటున్నారు రైతులు. ఇక ఎగువ రాష్ట్రాల నుంచి భారీగా వరద నీరు వస్తేనే శ్రీశైలం రిజర్వాయర్‌ నిండుకుండలా మారుతుంది. అయితే ఈ పరిస్థితులు లేకపోవడంతో శ్రీశైలం నుంచి తాజాగా నీటిని విడుదల చేసే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు.

గత ఏడాది ఇదే సమయానికి డ్యామ్‌ పూర్తిగా నిండిపోయి వందల టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి ఉంది. సాగర్ కూడా నిండి గేట్లు ఎత్తారు. పంటలకే కాదు, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అనేక రిజర్వాయర్లను, చెరువులను కూడా నింపిన పరిస్థితి గత ఏడాది కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే బియ్యం ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఒకింత సంతృప్తిగా ఉన్నారు. అయితే డ్యామ్‌ నిండని కారణంగా వరి వేయద్దు…ఆరుతడి పంటలు మాత్రమే వేయండి అని అధికారులు చెప్పడంతో నెత్తిన పిడుగు పడినట్లయిందని శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులో నీటిని ఎడాపెడా వదిలేయడంతోనే ఈ దుస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో 60 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచాలని, ట్రిబ్యునల్‌ కూడా అదే చెప్పిందని, కానీ అది జరగకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పంటలు కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు గుండెలు ఆవేదనతో మండిపోతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..